రెండ్రోజుల్లో మరొకటి రాక…
న్యూదిల్లీ: పశ్చిమాసియా యుద్ధ జ్వాలలను దాటి చమురు నౌకలు భారత్‌కు చేరుకుంటున్నాయి. ఇందులో ఒక నౌక అత్యంత వ్యూహాత్మకంగా బుధవారం నాటికి ముంబయికి చేరుకుంది. రెండ్రోజుల్లో మరొకటి భారత్‌కు చేరుకోనుంది. ఈ రెండింటి ద్వారా 3 మిలియన్ బ్యారెళ్ల చమురు అందుబాటులోకి రానుంది. లైబీరియా జెండాతో ఉన్న షెన్‌లాంగ్ అనే భారీ చమురు ట్యాంకర్ సౌదీ అరేబియాలోని రస్ తనూరా పోర్టులో ఈ నెల 1వ తేదీన చమురును నింపుకొంది. అప్పటికి పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమై ఒక రోజే అయింది. యుద్ధం తీవ్రమైన 3వ తేదీన అది అక్కడి నుంచి బయలుదేరింది. ఈ నౌకలో మిలియన్ బ్యారెల్ (1,35,335 టన్నులు) చమురు ఉంది. అప్పటికే ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలతోపాటు హర్మూజ్ జలసంధిపై ఇరాన్ దాడులు ప్రారంభించింది. ఈ నెల 9వ తేదీ నాటికి అది హర్మూజ్ జలసంధి వద్దకు చేరుకుంది. అక్కడే దాని కెప్టెన్ అయిన సుశాంత్ సింగ్ సంధు, సిబ్బంది వ్యూహాత్మకంగా వ్యవహరించారు. నౌక ప్రయాణాన్ని ఎవరూ ట్రాక్ చేయకుండా ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్, ట్రాన్స్‌పాండర్లను స్విచ్ఛాఫ్ చేశారు. జల సంధిని దాటి భారత్ దిశగా ప్రయాణిస్తున్నప్పుడు.. మళ్లీ ట్రాకింగ్ సిస్టమ్స్‌లో ఈ నౌక కనిపించింది. సంక్షోభ సమయాల్లో ప్రత్యర్థులకు చిక్కకుండా ఉండేందుకు అసాధారణ పరిస్థితుల్లో షిప్పింగ్ కంపెనీలు ఈ టెక్నిక్‌ను వాడుతుంటాయి. దీనిని గోయింగ్ డార్క్‌గా చెబుతుంటారు. బుధవారం ఎట్టకేలకు నౌక ముంబయి పోర్టుకు చేరుకుంది. నౌకలోని 29 మంది సిబ్బందిలో భారతీయులతో సహా పాకిస్థాన్, ఫిలిప్పీన్స్ జాతీయులున్నారు. భారతీయ జెండాతో ఉన్న వీఎల్‌సీసీ అనే మరో భారీ నౌక 2 మిలియన్ బ్యారెళ్ల చమురుతో ఇరాక్ నుంచి బయలుదేరి గురువారానికి భారత జలాల్లోకి ప్రవేశించింది. అది రెండ్రోజుల్లో ఒడిశాలోని పారాదీప్ పోర్టుకు చేరుకోనుంది.
భారత్‌కు చేరుకున్న చమురు నౌక
- Advertisement -
RELATED ARTICLES


