Homeనిరంతర గ్యాస్ సరఫరా

నిరంతర గ్యాస్ సరఫరా

- Advertisement -

బుక్ చేసిన రెండోరోజే డెలివరీ

. సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు
. ఆస్పత్రులు, స్కూళ్లు, దేవాలయాలకు అధిక ప్రాధాన్యత
. గ్యాస్ నిల్వలు, సరఫరాపై చంద్రబాబు సమీక్ష
. ఇండక్షన్ స్టవ్స్ వంటి ప్రత్యామ్నాయాలు అన్వేషించాలని సూచన

విశాలాంధ్ర బ్యూరో- అమరావతి: గృహ వినియోగానికి సంబంధించిన వంట గ్యాస్‌పై యుద్ధ ప్రభావం ఏమాత్రం పడకుండా… సిలిండర్ల సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు అధికారు లను ఆదేశించారు. ఆస్పత్రులు, స్కూళ్లు, దేవాలయాలకు ఇబ్బంది రాకుండా నిరంతర సరఫరా ఉండాలని సూచించారు. గతంలో మాదిరిగానే బుక్ చేసిన ఒకటిన్నర రోజు ల్లోనే సిలిండర్ అందించగలిగితే… ప్రజల్లో గ్యాస్ సరఫరా విషయంలో ఆందోళన ఉండదని, ఎల్పీజీ సరఫరా విషయంలో ప్రజల్లో ఆందోళనలు తొలగించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్రంలోని ఎల్పీజీ నిల్వలు, బుకింగ్, సరఫరా వంటి అంశాలపై సీఎం చంద్రబాబు సోమవారం సమీక్షించారు. ఓఎన్జీసీతోపాటు భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ సహా గ్యాస్ సరఫరా కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రంలో ఎల్పీజీ నిల్వలు, సరఫరా వంటి అంశాలపై పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,209 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ స్టాక్ అందుబాటులో ఉందని ఉన్నతాధికారులు వివరించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్ సంస్థలకు చెందిన 1154 ఏజెన్సీల నుంచి గ్యాస్ సరఫరా అవుతోందని అధికారులు వెల్లడించారు. ఎల్పీజీ సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కంపెనీల ప్రతినిధులను ఆదేశించారు. ప్రతి వినియోగదారు నుంచి ఓటీపీ తీసుకునే విధానాన్ని అవలంబించడం ద్వారా డొమొస్టిక్ సిలిండర్లు దుర్వినియోగం కాకుండా చూస్తున్నామని అధికారులు చెప్పారు. హెచ్‌పీసీఎల్ సంస్థ 90 శాతానికి పైగా ఓటీపీలతోనే గ్యాస్ సరఫరా చేస్తోందని, ఆ తర్వాత స్థానాల్లో బీపీసీఎల్, ఐఓసీఎల్ ఉన్నాయని అధికారులు తెలిపారు. ఓటీపీల విషయంలో ఏమైనా ఇబ్బందులుంటే… స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల ద్వారా సమన్వయం చేసుకుంటూ ఆర్టీజీఎస్ నుంచి సాంకేతిక సాయాన్ని ఆయా గ్యాస్ సరఫరా కంపెనీలకు అందించే ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు సీఎంకు తెలిపారు. గ్యాస్ డెలివరి విషయంలో సిలిండర్లు దుర్వినియోగం కాకుండా టెక్నాలజీ ఉపయోగించి పని చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
కీలక వ్యవస్థలకు ఇబ్బంది కలగకూడదు
కొన్ని కీలక వ్యవస్థలకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అన్న క్యాంటీన్లకు గ్యాస్ సరఫరా విషయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా అని ముఖ్యమంత్రి ఆరా తీశారు. రాష్ట్రవ్యాప్తంగా 17 సెంట్రల్లీ కిచెన్ల ద్వారా అన్న క్యాంటీన్లకు ఆహారం సరఫరా జరుగుతోందని, వాటికి ఎలాంటి ఇబ్బందుల్లేవని అధికారులు చెప్పారు. ఈ విషయంలో పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. హాస్టళ్లు వంటి వాటిల్లోనూ ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఎల్పీజీ వినియోగం తగ్గించుకునేలా హోటళ్ల అసోసియేషన్లతో ప్రభుత్వం సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇప్పటికే హోటళ్ల అసోసియేషన్లకు చెందిన కొందరు ప్రతినిధులతో మాట్లాడుతున్నామని, వారు ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామన్నారని మంత్రి అచ్చెన్నాయుడు సీఎం చంద్రబాబుకు వివరించారు. చిన్న చిన్న వ్యాపారులు రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బందులు లేకుండా… వారి జీవనోపాధికి ఆటంకం కలగకుండా కిరోసిన్ సరఫరా చేసే అంశాన్ని పరిశీలించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రస్తావించారు. సంక్షోభ సమయంలోనే ప్రత్యామ్నాయాల గురించి ఆలోచన చేసి… వ్యవస్థలను పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వివరించారు. యుద్ధం జరుగుతున్న సందర్భంలోనే కాకుండా… యుద్ధ విరమణ తర్వాత కూడా కొన్ని రోజులు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు లేకపోలేదని, వాటిని కూడా అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ఓఎన్జీసీ, గెయిల్, బీజీఎల్ వంటి సంస్థలతో ఇంటింటికి గ్యాస్ పైప్‌లైన్ కనెక్షన్లు ఇచ్చే సంస్థలు సమన్వయం చేసుకుని పని చేయాలని సీఎం సూచించారు.
ఈస్ట్-వెస్ట్ కార్గో కారిడార్‌గా ఏపీ: సీఎం
రాష్ట్రంలోని వివిధ పోర్టుల నుంచి కార్గో హ్యాండ్లింగ్ ఆపరేషన్ల ద్వారా ఈస్ట్ -వెస్ట్ కార్గో కారిడార్‌గా ఏపీని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో నూతనంగా నిర్మితమవుతున్న మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల్లో త్వరితగతిన కార్గో హ్యాండ్లింగ్ ఆపరేషన్లు ప్రారంభం కావాలని సీఎం స్పష్టం చేశారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మూడు పోర్టుల నుంచి పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, కsర్నాటక హింటర్ ల్యాండ్ నుంచి కార్గో రవాణా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు 2026 డిసెంబరు నాటికి పూర్తి అవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ రిఫైనరీ కూడా ఏర్పాటైన అనంతరం కంటైనర్, బల్క్ కార్గో పోర్టుగా రామాయపట్నం మారుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రామాయపట్నం నుంచి కడప స్టీల్‌ప్లాంట్ వరకూ ప్రత్యేక మార్గం వేసేందుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపిందని సీఎం తెలిపారు. ఏపీలో ఉన్న పోర్టులు కార్గో హ్యాండ్లింగ్‌లో గేమ్ ఛేంజర్‌గా మారాలని సీఎం సూచనలు చేశారు. యుద్ధం కారణంగా దుబాయ్, గల్ఫ్ దేశాల్లోని ఓడరేవులు ఇబ్బందుల్లో పడ్డాయని, ఇప్ప్పుడు భారత్‌లోని ఈస్ట్‌కోస్ట్‌లో ఉన్న పోర్టులే సురక్షితం అన్న అభిప్రాయం వచ్చిందని, ఈ ప్రయోజనాన్ని అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సమీక్షలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, మారిటైమ్ బోర్డు సీఈఓ అభిషేక్ కుమార్ హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు