Homeదివ్యాంగుల సాధికారతకు అండ

దివ్యాంగుల సాధికారతకు అండ

- Advertisement -

. ఆత్మగౌరవం పెంచేలా సంక్షేమ కార్యక్రమాలు
. దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
. మంగళగిరి నుంచి పెనుమాక వరకు బస్సు ప్రయాణం
. దివ్యాంగులకు సీఎం ఆత్మీయ విందు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : దివ్యాంగుల శక్తిని ప్రపంచానికి చాటేలా ఆత్మ స్థైర్యంతో పని చేసేలా తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దివ్యాంగులు సాధికారత సాధించడానికి… వారి గౌరవాన్ని మరింత పెంచడానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని దివ్యాంగులకు అందుబాటులోకి తెస్తూ దివ్యాంగ శక్తి పథకాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌తో కలిసి బుధవారం సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఏపీఎస్ ఆర్టీసీలోని సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. మొత్తంగా 21 కేటగిరీల బస్సుల్లో 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం కలిగిన దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తూ పథకాన్ని అమలులోకి తెచ్చారు. దివ్యాంగుల వెంట వచ్చే సహాయకులతో కలిపి మొత్తంగా 12.76 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించేలా ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలులోకి వచ్చింది. ఈ పథకం కోసం ఏటా రూ.207 కోట్లను ప్రజా ప్రభుత్వం ఖర్చు పెట్టనుంది. దివ్యాంగుల శక్తి పథకానికి సంబంధించిన ఈ నిధులను ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించనుంది. పథకం ప్రారంభించిన సందర్భంగా మంగళగిరి బస్టాండ్ నుంచి రాజధానిలోని పెనుమాక వరకు దివ్యాంగులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ బస్సులో ప్రయాణించారు. సుమారు 11 కిలో మీటర్ల మేర దివ్యాంగులతో ప్రయాణించిన నేతలు… వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అందిస్తున్న పథకాలను, కార్యక్రమాలను వివరించారు. ఈ పథకం ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రజలు, కూటమి పార్టీల కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రోడ్డుకు రెండు వైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేసుకుంటూ సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి నారా లోకేశ్ ముందుకు సాగారు. దివ్యాంగులతో కలిసి ప్రయాణం చేసిన అనంతరం తన నివాసంలో దివ్యాంగ శక్తి పథకం లబ్ధిదారులకు సీఎం ఆత్మీయ విందు ఇచ్చారు. విందుకు వచ్చిన వారిని ముఖ్యమంత్రి అప్యాయంగా పలుకరిస్తూ, వారితో కలిసి భోజనం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించటంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు దివ్యాంగులు ధన్యవాదాలు తెలిపారు. తమ వెంట వచ్చే సహాయకులకు ప్రయాణంలో 50 శాతం రాయితీ కల్పించటంపై హర్షం వ్యక్తం చేశారు.
దివ్యాంగుల్లో ఆత్మ విశ్వాసం నింపుతాం
గత 21 నెలల్లో కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. దివ్యాంగులంటే విభిన్న ప్రతిభావంతులు, సమస్యను అధిగమించి విజయాలు సాధించే శక్తి ఉన్న వాళ్లు. గతంలో చేయూత కార్యక్రమం ద్వారా దివ్యాంగులకు సహాయం చేశాం. దివ్యాంగులకు పింఛను కింద రూ.6 వేలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే. రూ.500 ఉండే దివ్యాంగుల పెన్షన్ ను రూ.6 వేలకు పెంచి ఇస్తున్నాం. తీవ్ర ఆరోగ్య ఇబ్బందుల్లో ఉండే వారికి రూ.10 వేలు, మంచానికి పరిమితమైన వారికి రూ.15 వేలు ఇస్తున్నాం. ఏటా పింఛన్ల కోసం రూ.33 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఇప్ప్పుడు బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం. దీనివల్ల నెలకు రూ.2 వేల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది. దివ్యాంగ శక్తితో లక్షల మందికి మేలు జరుగుతుందని సీఎం వివరించారు. దివ్యాంగ సమస్యలపై ఎప్ప్పుడూ పోరాటాలు చేసే మంద కృష్ణమాదిగ, గోనుగుంట్ల కోటేశ్వరావును సీఎం అభినందించారు. రాష్ట్రంలో ముందుకు వచ్చిన దివ్యాంగులకు శిక్షణ ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు వెళ్లేలా చేస్తామని హామీ ఇచ్చారు. అయితే గత ప్రభుత్వంలో దివ్యాంగుల ముసుగులో కొందరు పింఛన్లు పొందుతున్నారని, అన్ని అవయవాలు సవ్యంగా ఉన్నారు కూడా దివ్యాంగులమని తప్ప్పుడు సర్టిఫికెట్లు తెచ్చుకుని ప్రభుత్వ కోటాలో ఉద్యోగాలు పొందుతున్నారని, అలాంటి వారిని గుర్తించే చర్యలు చేపట్టాలని సీఎంకు కొందరు దివ్యాంగులు విజ్ఞప్తి చేశారు. దివ్యాంగులను ఆత్మీయంగా పలకరించిన మంత్రి లోకేశ్… తన పక్కన కూర్చొన్న శివనాగరాజు, సౌభాగ్య, ఖాశీంబి, అన్నపూర్ణమ్మతో మాటామంతీ కలిపారు. వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దివ్యాంగుల్లో పట్టుదల ఎక్కువ. అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. వారి నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. దివ్యాంగుల ఆత్మగౌరవం ముఖ్యమని లోకేశ్ చెప్పారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు