Homeజిల్లాలుచిత్తూరుతాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక ప్రణాళిక

తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక ప్రణాళిక

- Advertisement -

. కుప్పంలో 20 సమస్యాత్మక గ్రామాల గుర్తింపు
. రూ.23 లక్షలతో అంచనాలు

విశాలాంధ్ర-చిత్తూరు : జిల్లాలో భానుడి భగభగలు మొదలవ్వకముందే గ్రామీణ నీటి సరఫరా శాఖ అప్రమత్తమైంది. రానున్న వేసవి కాలంలో ప్రజలకు, పశువులకు తాగునీటి ఎద్దడి కలగకుండా ఉండేందుకు అధికారులు భారీ కసరత్తు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా నీటి లభ్యత ఆశాజనకంగా ఉన్నప్పటికీ, కుప్పం నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉందని గుర్తించిన అధికారులు రూ.23 లక్షలతో ముందస్తు ప్రణాళికను సిద్ధం చేశారు.
కుప్పంపై ప్రత్యేక శ్రద్ధ
జిల్లాలోని పలమనేరు, చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, నగరి నియోజకవర్గాల్లో ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా కురవడంతో తాగునీటి సమస్య పెద్దగా ఉండకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, కుప్పం నియోజకవర్గంలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇక్కడ గుడిపల్లి, కుప్పం, రామకుప్పం, శాంతిపురం మండలాల్లోని సుమారు 20 గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. రామకుప్పంలో 7, శాంతిపురంలో 8, గుడిపల్లిలో 4, కుప్పంలో ఒక గ్రామంలో తాగునీటి ఎద్దడి ఏర్పుతుందని అధికారులు అంచనా వేశారు.
నీటి సరఫరాకు రూ.10.57 లక్షలు
నీటి వనరులు అడుగంటిన 10 గ్రామాలకు అత్యవసరంగా ట్యాంకర్ల ద్వారా నీటిని చేరవేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం మొత్తం 1,854 ట్యాంకర్ ట్రిప్పులు అవసరమవుతాయని లెక్కగట్టారు. ఒక్కో ట్రిప్పుకు రూ.570 చొప్పున కేవలం ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకే రూ.10.57 లక్షల నిధులు అవసరమని ప్రతిపాదించారు.
పశువుల దాహార్తి తీర్చేందుకు చర్యలు
మనుషులకే కాకుండా పశువుల తాగునీటి అవసరాలను కూడా ఈ ప్రణాళికలో చేర్చారు. 7 గ్రామాల్లో పశువులకు నీటి కొరత రాకుండా 570 ట్రిప్పుల ద్వారా నీటిని సరఫరా చేయనున్నారు. ఇందుకోసం రూ.4.32 లక్షలు వెచ్చించనున్నారు.
ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి
శాశ్వత పరిష్కారంతో పాటు తక్షణ ఉపశమనం కోసం భూగర్భ జలాల వినియోగాన్ని పెంచేలా ప్రణాళికలు రూపొందించారు. 8 గ్రామాల్లో బోర్లను లోతు చేసేందుకు రూ.5.50 లక్షలు… 5 గ్రామాల్లో ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకునేందుకు రూ.2 లక్షలు… అత్యవసర అవసరాల కోసం 3 కొత్త బోర్వెల్ మోటార్ల సేకరణకు రూ.60 వేలు వెచ్చించనున్నారు. జిల్లా యంత్రాంగం ముందస్తుగా స్పందించి నిధుల అంచనాలు రూపొందించడంతో, వేసవి తీవ్రత పెరగకముందే పనులు పూర్తి చేసి కుప్పం ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చగలమని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు