థరద్(గుజరాత్): పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా తలెత్తిన సంక్షోభ పరిస్థితులను వాడుకుని రాజకీయ లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ పార్టీ యత్నిస్తోందని ప్రధాని మోదీ విమర్శించారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించి పెట్రోల్ పంపుల వద్ద బారులుతీరి నిలబడేలా చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తోందన్నారు. దేశమంతా ఐక్యంగా నిలవాల్సిన సమయంలో కాంగ్రెస్ నేతలు విభజన రాజకీయాల్లో నిమగ్నమయ్యారని, రాజకీయ రాబందుల్లా కాచుకుని ఉన్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గుజరాత్లోని వావ్-థరాద్ జిల్లాలో మంగళవారం నిర్వహించిన సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. భారత్ ఎటుంటి సంక్షోభాన్ని అయినా ఎదుర్కోగలదని ధీమా వ్యక్తం చేశారు. ‘యుద్ధంతో యావత్ ప్రపంచం సతమతమవుతోంది. అస్థిరత నెలకొంది. ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో దృఢమైన విదేశాంగ విధానం, ప్రజల ఐక్యతతో భారత్ సమర్థంగా వ్యవహరించింది’ అని ప్రధాని తెలిపారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగినప్పటికీ ఆ ప్రభావం ప్రజలపై పడకుండా చూసేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ఇటువంటి విపత్కర సమయాల్లో రాజకీయాలు చేయడం తగదన్నారు. కీలక సమయాల్లో బాధ్యతాయుతమై పాత్ర పోషించాలన్నారు.
రాజకీయ లబ్ధికోసం ప్రజలను రెచ్చగొడుతోన్న కాంగ్రెస్: ప్రధాని మోదీ
- Advertisement -
RELATED ARTICLES


