రాష్ట్రంలో 2వ స్థానంలో రాజాం మున్సిపాలిటీ
విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా): ఆస్తి పన్నుల వసూళ్లలో రాజాం పురపాలక సంఘం రాష్ట్రవ్యాప్తంగా రెండో స్థానంలో నిలవడం అభినందనీయంగా నిలిచింది. మొత్తం రూ.4.02 కోట్ల లక్ష్యానికి గాను రూ.3.28 కోట్లను వసూలు చేసి ఈ ప్రతిష్టాత్మక స్థానాన్ని దక్కించుకుంది. రాష్ట్రంలోని 123 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో రాజాం మున్సిపాలిటీ ఈ ఘనత సాధించినట్లు రాష్ట్ర పురపాలక పరిపాలన శాఖ వెల్లడించింది. ఈ విజయానికి ప్రధాన కారణం పట్టణ ప్రజలు బాధ్యతగా ముందుకు వచ్చి పన్నులు సమయానికి చెల్లించడమేనని మున్సిపల్ కనీషనర్ ఏ.రామచంద్రరావు పేర్కొన్నారు. పౌరుల చైతన్యం, అభివృద్ధిపై వారి ఆసక్తి ఈ ఫలితాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. పట్టణ అభివృద్ధి పనులు మరింత వేగంగా, సమర్థంగా అమలు కావడానికి ప్రజల సహకారం అత్యంత కీలకమని, ఇదే విధంగా భవిష్యత్తులో కూడా పన్నులు సమయానికి చెల్లిస్తూ మున్సిపాలిటీకి తోడ్పడాలని అధికారులు కోరారు. ప్రజలు చూపిన బాధ్యత, సహకారం అభినందనీయమని పేర్కొంటూ, ఇదే స్పూర్తితో రాజాంను మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.


