జిల్లా ఇన్చార్జ్ వైద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి
విశాలాంధ్ర -అనంతపురం : టౌన్ లింగ నిర్ధారణ నిషేధి చట్టం అమలులో స్వర్ణ వార్డుల్లో పనిచేస్తున్న మహిళా సంక్షేమ సిబ్బంది, మహిళా పోలీసులు భాగస్వాములు కావాలని జిల్లా ఇంచార్జ్ వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మంగళవారం స్థానిక డీఎంహెచ్వో కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై మహిళా పోలీస్ లకు శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రోజురోజుకు తగ్గిపోతున్న లింగ నిష్పత్తి ఆందోళన కలిగిస్తుందన్నారు. ఆడ కూతురు ప్రాముఖ్యత, లింగ వివక్ష నివారణ పై సమాజానికి తెలియ చెప్పాల్సిన బాధ్యత మహిళా పోలీసులు కూడా తీసుకోవాలన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుబ్బలక్ష్మి మాట్లాడుతూ… మహిళా జాతిని రక్షించుకునేందుకు లింగ నిర్ధారణ నిషేధ చట్టం పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రజల మధ్యన పనిచేస్తున్న మహిళా పోలీసులు చట్ట అమలుకు సరైన వారదులని చెప్పారు. జిల్లా మాస్ మీడియా అధికారి ఈ .నాగరాజు శిక్షణ ఇస్తూ చట్టాన్ని విపులంగా వివరించి అమలకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మాస్ మీడియా అధికారి లక్ష్మీనారాయణ, దిశా పోలీస్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, న్యాయ సలహాదారులు ఆషారాణి, సంధ్యారాణి, ఆరోగ్య విద్యాధికారులు వేణుగోపాల్, వెంకటేశ్వరరావు, కిరణ్, డెమో, అనంతపురం నగరానికి చెందిన స్వర్ణ సచివాలయంలో పనిచేస్తున్న మహిళా పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.


