- నిబంధనలు గాలికి.. పచ్చదనం మాయం!
- వేదికలపై వృక్షోరక్షితి ప్రసంగాలు.. క్షేత్రస్థాయిలో గొడ్డలి వేట్లు
- అనంతపురం నుండి కొడికొండ చెక్ పోస్ట్ వరకు యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాల కబ్జా
- పట్టించుకోని ప్రజా ప్రతినిధులు, అధికారులు
విశాలాంధ్ర-రాప్తాడు: అనంతపురం నుంచి బెంగళూరు వెళ్లే 44వ జాతీయ రహదారి (ఎన్.హెచ్-44) ప్రస్తుతం అక్రమార్కులకు కేరాఫ్ గా మారింది. అనంతపురం నగరం నుంచి కొడికొండ చెక్ పోస్ట్ వరకు రహదారికి ఇరువైపులా నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. భవిష్యత్తులో రహదారి విస్తరణ కోసం కేటాయించిన ప్రభుత్వ భూములను వెంచర్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, దుకాణాల నిర్వాహకులు యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు. అధికారుల కళ్లముందే ఈ అక్రమ పర్వం కొనసాగుతున్నా, పర్యవేక్షించాల్సిన పాలకులు సైతం మౌనం వహించడంపై సామాన్య ప్రజలు మండిపడుతున్నారు.
వేదికలపై వృక్షోరక్షితి.. క్షేత్రస్థాయిలో గొడ్డలి వేట్లు!
”మొక్కలను నాటి వృక్షాలుగా కాపాడితేనే మానవ మనుగడ సాధ్యం” అంటూ ప్రజాప్రతినిధులు వేదికలపై మైకుల ముందు ఊదరగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పచ్చని చెట్లు గొడ్డలి వేట్లకు గురవుతున్నా అధికారులు, పాలకులు కన్నెత్తి చూడటం లేదు. ప్రైవేటు వెంచర్లు, హోటళ్లకు దారి కోసం, పార్కింగ్ స్థలాల కోసం జాతీయ రహదారి పక్కన ఉన్న పచ్చదనాన్ని నిర్దాక్షిణ్యంగా తుడిచిపెడుతున్నారు. పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్న అక్రమార్కులకు అడ్డుకట్ట వేయకపోవడం వెనుక ఉన్న ‘అంతర్యం’ ఏమిటని ప్రయాణికులు, పర్యావరణ ప్రేమికులు నిలదీస్తున్నారు.
నీడ లేని రహదారి.. నిలువు దోపిడీ!
ఇరవై ఏళ్ల క్రితం రహదారి విస్తరణ సమయంలోనే వేలాది భారీ వృక్షాలను కోల్పోగా, ఇప్పుడు మిగిలి ఉన్న కొద్దిపాటి పచ్చదనాన్ని కూడా ప్రైవేటు వ్యక్తులు తుడిచిపెడుతున్నారు. రహదారి పొడవునా చెట్లు లేకపోవడంతో లారీలు, బస్సులు, కార్ల డ్రైవర్లు ఎండ తీవ్రతకు సేదతీరడానికి కనీసం నీడ దొరకక అల్లాడిపోతున్నారు. ఇక వేసవి కాలంలో జాతీయ రహదారిపై నిలువ నీడ లేకుండా ఉండడంతో ప్రయాణించాలంటేనే భయమేస్తుందని ప్రయాణికులు బెంబేలు ఎత్తుతున్నారు. చెట్లు లేని కారణంగా ప్రయాణికులు విధిలేని పరిస్థితుల్లో ఏకైక ఆశ్రయమైన హోటళ్లకు వెళ్లాల్సి వస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకుని రహదారి వెంట ఉన్న హోటళ్ల నిర్వాహకులు సామాన్యుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
అలంకారానికే డివైడర్ మొక్కలు
రహదారి మధ్యలో డివైడర్లపై నాటిన మొక్కలు కేవలం అలంకారానికే పరిమితమయ్యాయి. కాంట్రాక్టర్ల నిర్వహణ లోపం వల్ల అనేక చోట్ల ఈ మొక్కలు ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. ఒకవైపు ఆక్రమణలు, మరోవైపు పచ్చదనం మాయమవుతుండటంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. దీనికి తోడు అనంతపురం నుంచి కొడికొండ వరకు సర్వీస్ రోడ్ల నిర్మాణం ఎక్కడా పూర్తిస్థాయిలో లేకపోవడంతో స్థానిక ప్రజలు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యం.. కలెక్టర్లు స్పందించాలి!
జాతీయ రహదారి అధికారులు రోజూ ఈ మార్గంలో ప్రయాణిస్తున్నా, తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడం శోచనీయం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, జాతీయ రహదారి ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలి. ఆక్రమించిన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడంతో పాటు, చెట్లను నరికివేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మాటలకే పరిమితం కాకుండా ప్రజా ప్రతినిధులు కూడా ఈ సమస్యపై దృష్టి సారించి రహదారి వెంట పచ్చదనాన్ని పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.
ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి: మేకల రమేష్, సిపిఐ నియోజకవర్గం కార్యదర్శి రాప్తాడు
జాతీయ రహదారి వెంబడి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి రహదారి పక్కన నిబంధనలకు విరుద్ధంగా చెట్లను నరికివేస్తూ పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న వ్యక్తులపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం సరికాదన్నారు. పచ్చదనానికి పెద్దపీట వేసేలా చర్యలు తీసుకోవాలని, గతంలో ఉన్న విధంగా రహదారి వెంబడి నీడను ఇచ్చే చెట్లను పెంచాలని కోరారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అధికారులు తక్షణమే స్పందించి అక్రమ కట్టడాలను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.



