గవర్నర్ వద్దకు జననాయగన్ నిర్మాత…విజయ్‌కు కొత్త చిక్కులు
సీఎం సీటుకు రెండు సీట్ల దూరంలో విజయ్
చెన్నై: తమిళ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించి, విజయ్‌కు సీఎం పీఠం ఖాయమైనా…ఇంకా తన చేతికి అధికార పగ్గాలు అందడంలేదు. ప్రమాణ స్వీకారం వాయిదా పడుతూ వస్తోంది. నెంబర్ గేమ్ ఇప్ప్పుడు తమిళనాట ఉత్కంఠ రేపుతోంది. రెండు సీట్ల దూరంలో విజయ్ ప్రభుత్వ ఏర్పాటు ఆగిపోవలసి వస్తోంది. ఇదే సమయంలో విజయ్ కీలక మంత్రాంగం సాగిస్తున్నారు. కాగా… ప్రస్తుత ప్రతిష్టంభన వేళ, తాజాగా జననాయగన్ నిర్మాత గవర్నర్‌ను కలవటం కొత్త వివాదంగా మారింది. 2026 అసెంబ్లీ ఎన్నికలు-వన్ ఇండియాలో పూర్తి వివరాలు విజయ్ ప్రభుత్వ ఏర్పాటు పైనా ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. మొత్తం 118 సీట్ల మెజార్టీ ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తానని గవర్నర్ తేల్చి చెప్పారు. అందుకు అవసరమైన పూర్తి మెజార్టీ పైన స్పష్టత రావటంతో…శనివారం విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారని అంతా అంచనా వేశారు. అయితే, చివరి నిమిషంలో చోటు చేసుకున్న పరిణామాలతో ఇంకా రెండు సీట్ల మద్దతు విజయ్‌కు అవసరం. ఈ సస్పెన్స్ కొనసాగుతున్న సమయంలోనే విజయ్ మరోసారి గవర్నర్‌ను కలిశారు. ఆ సమయంలో విజయ్‌తో పాటుగా జననాయగన్ నిర్మాత వెంకట నారాయణ ఉండటం పైన ప్రత్యర్ధి పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే జననాయగన్ విడుదలపై కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు వంటి కీలక అంశాల చర్చల వేళ గవర్నర్ వద్దకు విజయ్ తన సినిమా నిర్మాతను ఎలా తీసుకెళ్తారనే ప్రశ్నలు మొదలు పెట్టారు. దీని పైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
విజయ్‌పై విమర్శలు మొదలు…
విజయ్‌కు పార్టీ ఏర్పాటు నుంచి ప్రభుత్వం ఏర్పడే వరకు కొందరు ముఖ్యులు అన్నీ తామై తెర వెనుక వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో ఏపీ మూలాలు ఉన్న ఒక పారిశ్రామి వేత్త సైతం విజయ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా గవర్నర్ ను కలిసిన వారిలో ఆయన ఉన్నారు. ఇదే ఇప్ప్పుడు విజయ్‌కు సమస్యగా మారింది. వీరితో కలిసి విజయ్ గవర్నర్ వద్దకు వెళ్లటం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు వేళ సినీ నిర్మాతలు…వ్యాపారవేత్తలతో కలిసి చర్చలు ఏంటని నిలదీస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు విషయంలోనూ టీవీకే అనుభవ రాహిత్యం, పొరపాట్లు విజయ్‌కు సమస్యగా మారుతున్నాయి.


