. నేడు, రేపు రాష్ట్రంలో పసుపు పండుగ
. పొదుపు చర్యల్లో భాగంగా తొలిసారి వర్చువల్‌గా నిర్వహణ
. క్షేత్రస్థాయి కార్యకర్తలతో పార్టీ అధినేత చంద్రబాబు ముఖాముఖి
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ ఎన్టీ రామారావు జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా మార్చి 27, 28 తేదీల్లో జరిగే ఈ పసుపు పండుగను పొదుపు చర్యల్లో భాగంగా గతానికి భిన్నంగా 2026 మహానాడును హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నారు. తొలుత నెల్లూరులో నిర్వహించాలని నిర్ణయించి ఏర్పాట్లు కూడా ప్రారంభించారు. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం నేపథ్యంలో దేశంలో ఇంధన పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని పిలుపునివ్వడంతో పార్టీ అధినేత చంద్రబాబు వర్చువల్‌గా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. పొలిట్ బ్యూరో సభ్యులతో పాటు జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పాల్గొననుండగా, ఈ కమిటీల్లో లేని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా వారి వారి ప్రాంతాల నుంచి వర్చువల్ పద్ధతిలో పాల్గొంటారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,800 కు పైగా క్లస్టర్లల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి అక్కడ కూడా పండుగ వాతావరణంలో మహానాడును నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. రెండు రోజుల మహానాడులో వివిధ కీలక అంశాలపై 20 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. వీటిల్లో 10 ఏపీ, 4 తెలంగాణ, 1 అండమాన్‌కు సంబంధించిన తీర్మానాలు ఉంటాయి. ఇక ఉమ్మడిగా 4 తీర్మానాలతో పాటు చివరిగా అత్యంత కీలకమైన రాజకీయ తీర్మానం ఉంటుంది.
చర్చలు… తీర్మానాలు… కార్యాచరణ
రెండు రోజుల మహానాడులో ఏయే అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టాలనే దానిపై పార్టీలో ఇప్పటికే కసరత్తు జరిగింది. ఈ ఏడాది స్త్రీ శక్తి థీమ్‌తో నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించుకున్న క్రమంలో మహానాడు వేదికగా జరగబోయే ప్రసంగాలు మహిళా శక్తి కేంద్రీకృతంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివిధ అంశాలపై చర్చించడం… తీర్మానాలు చేయడం… ఆయా అంశాలకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేయడం చేస్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి కావస్తున్నందున, వచ్చే ఎన్నికలకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకునే దిశగా టీడీపీ అధినాయకత్వం మహానాడు వేదికగా దిశా నిర్దేశం చేసే సూచనలున్నాయి. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేయనున్నారు. మహానాడు తొలి రోజున టీడీపీ జాతీయ అధ్యక్షులు, సీఎం చంద్రబాబు ఉదయం 9 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళతారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్‌కు నివాళులర్పిస్తారు. పార్టీ కోసం ప్రాణాలర్పించిన వారికి నివాళులర్పిస్తారు. అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్రారంభ ఉపన్యాసంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పార్టీ పద్దుల వివరాలను వివరిస్తారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తారు. స్త్రీశక్తి, కార్యకర్తే అధినేత, పేదల సేవలో వంటి అంశాలపై నేతల ప్రసంగిస్తారు. వీటిల్లో భాగంగా వివిధ తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. సాయంత్రం 6 గంటలకు మొదటి రోజు కార్యక్రమం ముగుస్తుంది. ఇక రెండవ రోజు 28 వ తేదీన ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని నివాళులర్పిస్తారు. తెలుగుజాతి విశ్వఖ్యాతి, గతంలో పార్టీ చేసిన పోరాటాలు, అన్నదాతకు అండగా, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందించే సాయం, నా దేశం… నా బాధ్యత, ఆధ్యాత్మీకాంధ్ర, మౌలిక సదుపాయాల కల్పన, శాంతిభద్రతలు, విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం, సంపద సృష్టి వంటి అంశాలపై చర్చించి తీర్మానాలను ఆమోదిస్తారు. ఇక చివరిలో రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముగింపు ఉపన్యాసంతో రెండు రోజుల మహానాడు ముగుస్తుంది. మంత్రి నారా లోకేశ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత జరుగుతున్న తొలి మహానాడు ఇదే. ఈ నేపథ్యంలో ఆయన ప్రసంగం, దిశా నిర్దేశం ఎలా చేస్తారనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది.


