కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న అనంతరం మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. ఈ భేటీలో తన కుమారుడు యతీంద్రకు రాష్ట్ర మంత్రివర్గంలో కీలక బాధ్యతలు అప్పగించే అంశాన్ని పార్టీ అధిష్ఠానం పరిశీలించాలని ఆయన కోరినట్లు సమాచారం. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత సిద్ధరామయ్య గురువారం రాత్రి దిల్లీకి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం తన కుమారుడు యతీంద్రతో కలిసి రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు.
రాష్ట్ర రాజకీయాలపై, భవిష్యత్ కార్యాచరణపై చర్చ
ఈ సందర్భంగా తనకు రాజ్యసభ సభ్యత్వంపై ఆసక్తి లేదని, కర్ణాటక రాజకీయాల్లోనే కొనసాగుతూ ప్రజలకు సేవ చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు రాహుల్ గాంధీకి సిద్ధరామయ్య కృతజ్ఞతలు తెలిపినట్లు సమాచారం.
రాష్ట్ర రాజకీయాలపై, భవిష్యత్ కార్యాచరణపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.


