Homeజాతీయంసీబీఎస్ఈ పోర్టల్‌పై సైబర్ దాడి

సీబీఎస్ఈ పోర్టల్‌పై సైబర్ దాడి

- Advertisement -


న్యూదిల్లీ: దేశంలోని పరీక్షా విధానంలో ఇటీవల తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. మొన్నటికి మొన్న నీట్ పరీక్షా పత్రాలు లీక్ కాగా…తాజాగా సీబీఎస్ఈ పోర్టల్‌పై సైబర్ దాడి జరిగినట్లు తెలుస్తోంది. సీబీఎస్ఈ రీవాల్యుయేషన్ పోర్టల్ పేమెంట్ సిస్టమ్‌ను హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 50 మంది విద్యార్థులు పోర్టల్‌లోకి అనధికారికంగా లాగిన్ అయినట్లు సమాచారం. ఈ మేరకు హ్యాకింగ్ గురించి ప్రభుత్వ వర్గాలు మీడియాకు వెల్లడించాయి. సీబీఎస్ఈ 12వ తరగతిలో కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) పద్ధతి కారణంగా తమ సమాధాన పత్రాలు తారుమారయ్యాయంటూ కొందరు విద్యార్థులు ఆందోళనలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన బోర్డు విద్యార్థులకు జవాబు పత్రాల స్కానింగ్ కాపీలను అందిస్తామని, వాటిని సరిచూసుకొని రీవాల్యూయేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఈ రీవాల్యూయేషన్ కోసం చెల్లించాల్సిన పేమెంట్ పోర్టల్‌పైనే తాజాగా సైబర్ దాడి జరిగిందని అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో చెల్లింపుల్లో హెచ్చుతగ్గులు కన్పించినట్లు తెలిపాయి. ఒక్కో విద్యార్థికి చెల్లించాల్సిన మొత్తం సొమ్ము రూ.1 నుంచి దాదాపు రూ.68వేల మధ్య వేర్వేరుగా చూపిస్తోందని పేర్కొన్నాయి. అయితే, హెచ్‌డీఎఫ్‌సీ చెల్లింపులకు సంబంధించిన గేట్‌వేలో మాత్రమే ఈ సమస్యలు ఎదురైనట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ సైబర్ దాడిపై అధికారులు అప్రమత్తమయ్యారు. ఐఐటీ మద్రాస్, ఐఐటీ కాన్పూర్‌కు చెందిన సాంకేతిక నిపుణులు రంగంలోకి దిగి సమస్యను పరిష్కరిస్తున్నారు.
20 జవాబు పత్రాలు తారుమారు…
ఓఎస్ఎం పద్ధతి నేపథ్యంలో తమ జవాబు పత్రాలు మారిపోయాయని సీబీఎస్ఈకి పలువురు విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే. మొత్తం 20 జవాబు పత్రాలు తారుమారైనట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆయా విద్యార్థులను సంప్రదించి… వారికి సరైన జవాబు పత్రాలను కూడా అందించినట్లు తెలిపాయి. కాగా…8లక్షలకు పైగా జవాబు పత్రాలకు సంబంధించి దాదాపు 40 కోట్ల పేజీలను ఓఎస్ఎం పద్ధతి ద్వారా తాము స్కాన్ చేశామని పేర్కొన్నాయి. అందులో 68వేల పత్రాల్లో నాణ్యత సమస్యలు తలెత్తడంతో వాటిని రీస్కాన్ చేసినట్లు వెల్లడించాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు