మహిళలు తాగునీటి సమస్యను పరిష్కరించిన అధికారులు
విశాలాంధ్ర – కంబదూరు: కంబదూరు మండల కేంద్రంలోని కోటవీధి మసీదు వెనుక కాలనీలో గత 25 రోజులుగా కొనసాగుతున్న తాగునీటి సమస్యపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా నిర్వహించారు. తాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, పలుమార్లు అధికారులకు విన్నవించినా సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సూర్యనారాయణ, డిప్యూటీ ఎంపీడీవో నీలావతి, పంచాయతీ కార్యదర్శి మహేష్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టినప్పటికీ మహిళలు కార్యాలయం ఎదుట నిరసన కొనసాగించారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే అధికారులు అప్రమత్తమై వాటర్ ట్యాంక్‌కు సంబంధించిన గేట్ వాల్వ్ మరమ్మతు పనులను అత్యవసరంగా చేపట్టారు.అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడంతో ఆరు గంటల వ్యవధిలోనే కాలనీలో తాగునీటి సరఫరా పునరుద్ధరించబడింది. సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపిన అధికారులకు, సిబ్బందికి కాలనీ మహిళలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.


