ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరించిన ఇజ్రాయిల్
గల్ఫ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు
తెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రికత్తలు మళ్లీ చెలరేగుతున్నాయి. లెబనాన్‌ను టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌పై ఇరాన్ మరోసారి మిసైళ్లను ప్రయోగించింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పడేలా ఇరాన్ ఇజ్రాయిల్‌పై మిసైల్ దాడులు చేసింది. ఆదివారం దక్షిణ బీరూట్‌కు (లెబనాన్) సమీపంలోని సబర్బన్ ప్రాంతాలపై ఇజ్రాయెల్ చేసిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయిల్‌ను తాజాగా టార్గెట్ చేసింది. అనంతరం, ఇజ్రాయిల్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ‘ఈ దాడులు మళ్లీ జరిగితే మా ప్రతిస్పందన మరింత తీవ్రంగా ఉంటుంది. అమెరికన్, జియోనిస్టు స్థావరాలన్నిటినీ టార్గెట్ చేస్తాం’ అని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో కువైట్, ఇరాక్‌లు తమ గగనతలాన్ని మూసివేశాయి. ఇరాన్ మిసైల్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయిల్‌లో మరోసారి సైరెన్ల మోగాయి. ప్రజలు షెల్టర్లలో తలదాచుకోవాలని ఇజ్రాయిల్ ప్రభుత్వం అలర్టులు జారీ చేసింది. ఇరాన్‌కు చెందిన 10 మిసైల్స్‌ను ఇజ్రాయిల్ మార్గమధ్యంలోనే అడ్డుకున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పలు మిసైల్స్‌ను అడ్డుకున్నామని ఇజ్రాయిల్ దళాలు కూడా వెల్లడించాయి. ప్రతీకారం తప్పదని హెచ్చరించాయి. ‘ఇరాన్ భారీ తప్పిదానికి పాల్పడింది. మేము మరింత పవర్‌ఫుల్‌గా దాడి చేస్తాము. శత్రువు ఆత్మవిశ్వాసం సడలిపోయేలా విరుచుకుపడతాము’ అని ఇజ్రాయిల్ మిలిటరీ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫ్ఫీ డెఫ్రిన్ హెచ్చరించారు.
ఇదిలా ఉంటే…ఇరాన్‌పై ప్రతికార దాడులు చేయకుండా ఇజ్రాయిల్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కట్టడి చేసినట్టు అంతర్జాతీయ మీడియా సంస్థ ఆక్సియోస్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా యూఎస్-ఇరాన్ చర్చలు పక్కదారి పట్టకూడదని ట్రంప్ భావిస్తున్నట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. యూఎస్‌తో తమకు కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం పరిధిలోకి ఇజ్రాయెల్, లెబనాన్లు కూడా వస్తాయని ఇరాన్ వాదిస్తోంది. తమ మిత్ర దేశాలపై దాడులను సహించబోమని ఇజ్రాయెల్‌కు స్పష్టం చేసింది.
ఇజ్రాయిల్‌పై ఇరాన్ మిసైల్ దాడి
- Advertisement -


