Homeవిశ్లేషణమూలపేట పోర్టుకు విశాఖ కాలుష్యం!

మూలపేట పోర్టుకు విశాఖ కాలుష్యం!

- Advertisement -

నల్లి ధర్మారావు

మురికిని వదిలించుకోవడం సులువు. మూలకారకాలను వదిలించుకోవడమే కష్టం! కారకాలను గుర్తించి, మరోవైపు మళ్లించడమే సమస్యకు శాశ్వత పరిష్కారం. ఇలాంటి ఆలోచనలే వచ్చి ఉంటాయి కాబోలు, విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ వారికి!? వచ్చీ రావడంతోనే, నాలుగు దిక్కులు చూస్తే ,మూలపేట పోర్టు ముచ్చటగా కనిపించిందేమో! కాలుష్యం విరజిమ్మే ఖనిజాలను విశాఖ నుంచి తరలించాలని నిర్ణయించింది. కాలుష్య రహిత విశాఖను రూపొందించాలని తహతహలాడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనలు కూడా ఈ ప్రతిపాదన వెనుక పని చేసి ఉండొచ్చు. పోర్టు సిటీ క్రమంగా ప్రభుత్వరంగ సంస్థల నగరంగా మారింది (పబ్లిక్ సెక్టార్ సిటీ). నగరపాలక సంస్థ ఎల్లలను విస్తరించుకొని, ‘మహా’ గా మారి, స్టీల్ సిటీగా రూపాంతరం చెందింది. ఆ తర్వాత ఉన్న ఈ ఒక్క సిటీలోనే ఎన్నెన్నో నగరాలను సృష్టించాలని ప్రభుత్వాలు తాపత్రయపడుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ సిటీ నామకరణాల ముచ్చటెక్కువ! స్మార్ట్ సిటీ, ఫార్మాసిటీ, ఇంటిగ్రేటెడ్ సిటీ, బ్రౌన్ ఫీల్డ్ సిటీ, ఐటీ సిటీ, డేటా సిటీ, బే సిటీ ఇలా ఆయనకు ఏది ముచ్చటైతే అది! పబ్బులూ, హబ్బులూ అదనపు ఆకర్షణ. డబ్బులే ప్రధానం. బీర్ షాక్స్‌ తాజా కొసమెరుపు! ఇంతవరకు, సిటీ ఆఫ్ డెస్టినీగా గౌరవం పొందిన విశాఖ, సిటీ ఆఫ్ డస్ట్‌గా మారిపోతుంది. ఒకనాడు ధగధగా మెరిసిన జ్యువల్ సిటీ, మసకబారిపోతోంది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత, అంతర్జాతీయ పెట్టుబడులను ఎక్కువగా ఆకర్షిస్తున్న మహానగరం, రాష్ట్రంలో ఇదొక్కటే! ఆహ్లాదం, అందం, ప్రశాంతత, పర్యాటకం, సహజ వనరులు, భూ, వాయు, జలమార్గాల వంటి సదుపాయాలు సమృద్ధిగా ఇక్కడ ఉన్నాయి. అన్నింటికీ మించి, ఇది తూర్పు నౌకాదళ కేంద్రం కావడం వల్ల, సురక్షిత ప్రాంతంగా అంతర్జాతీయ సంస్థల నమ్మకాన్ని పొందింది. ఉన్న సమస్యంతా ఒక్కటే అదే వాయు కాలుష్యం! ప్రపంచంలోనే అత్యంత వాయు కాలుష్యం ఉన్న తొలి ఇరవై మహానగరాల్లో, దేశ రాజధాని దిల్లీ ఒకటి. ఒక్కోసారి కాలుష్య నగరాలలో దిల్లీని మించిపోతుంది విశాఖ. అందరినీ ఆందోళనకు గురిచేస్తున్న పరిణామమిది! దిల్లీ, విశాఖ కాలుష్యాలకు కారణాలు వేర్వేరు. పారిశ్రామిక వ్యర్ధాలు, వాహనాల ఉద్గారాలు, భవన నిర్మాణాల ధూళి, పరిసర రాష్ట్రాల నుంచి వచ్చే పంటల వ్యర్ధాలను దహనం చేయడం ద్వారా వచ్చే దుమ్ముదూళీ కూడా ప్రధాన కారణాలు. విశాఖలో వాహనాల ఉద్గారాలతో పాటు, పారిశ్రామిక కాలుష్యం ప్రధానం. దీన్ని వ్యాప్తి చేయడంలో, విశాఖ ప్రధాన పోర్టు ట్రస్ట్దే పెద్ద వాటా! భౌగోళిక ఇబ్బందులు కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. ఒక వైపు సముద్రం, మూడు వైపులా కొండలు. దీనివల్ల కాలుష్యం సమస్యగా మారింది. శీతాకాలంలో మరీ నెమ్మదించడం కలవరపరుస్తోంది. పరిమిత స్థాయికి మించిన వాయు కాలుష్యం వల్ల, ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులు ఎక్కువవుతున్నాయి. ఇది నియంత్రణలో లేకపోతే, దిల్లీ పౌరుల సగటు ఆయుర్దాయంలో 8.2 సంవత్సరాలు తగ్గిపోతున్నట్టు చికాగో యూనివర్సిటీ ఒక అధ్యయనంలో తెలిపింది. కాలుష్యం స్థాయి పెరిగినప్పుడు, గ్రేడెడ్ రెస్పాన్స్‌ యాక్షన్ ప్లాన్ (జీఆర్ ఏపీ) ని దిల్లీ ప్రభుత్వం అమలు చేస్తుంది. పాఠశాలలు, కార్యాలయాల పనివేళలపై ఆంక్షలు, పార్కుల్లో ప్రవేశంపై, నిర్మాణాలపై నిషేధం విధిస్తోంది. ఇలాంటి దుస్థితిలో విశాఖ ఉంటే, అంతర్జాతీయ పెట్టుబడులు రావడం కష్టం. ప్రధాన పోర్టు నుంచి దేశ, విదేశాల మధ్య, ఏటా 95 మిలియన్ టన్నుల సరుకు లావాదేవీలు జరుగుతున్నాయి. వీటిల్లో ధూళి వెదజల్లేవే ఎక్కువ. మరో, 1.20 లక్షల టన్నుల స్టీమ్ కోల్, కోకింగ్ కోల్, ఇనుము, జిప్సం, సల్ఫర్, అమ్మోనియా వంటి ఖనిజాలు కూడా ఉన్నాయి. పాత పోస్టాఫీస్, ఓల్డ్ సిటీ, మర్రిపాలెం, అక్కయ్యపాలెం, పెదగంట్యాడ, మేఘాద్రి గడ¦ అవుట్లెట్ వరకూ కాలుష్యం గాలి తెరలు వ్యాపిస్తున్నాయి. పేరుకుపోయిన నల్లటి ఖనిజ ధూళి పొరల మధ్య, పాత పోస్టాఫీస్ ప్రాంతంలోని పేదల, సామాన్యుల జీవనం అత్యంత దయనీయం. కొన్ని కోట్ల రూపాయలతో కాలుష్యం నియంత్రణకు పోర్టు ట్రస్ట్ అమలుచేస్తున్న ప్రణాళికల వల్ల పెద్దగా ఫలితాలు కనిపించడం లేదు. అమల్లోనే అవకతవకలు ఉన్నాయి. ఖనిజాల బహిరంగ నిల్వలపై టార్పాలిన్లు వేయాలి. ఫాగ్ మిషన్లు, వాటర్ స్రిÎంక్ల£ర్లతో ధూళిని అదుపు చేయాలి. బెర్తుల వరకు ఖనిజాలను రవాణా చేసే ట్రక్కులపై టార్ఫాలిన్లు కప్పాలి. గత ఫిబ్రవరిలోనే టార్ఫాలిన్స్‌ లేని,1191 ట్రక్కులకు జరిమానాలు విధించారు. దేశంలోని పోర్టుల్లో అత్యధిక సౌర విద్యుత్ వినియోగిస్తున్న పోర్టు ఇదే. 95 శాతం రైల్వే కనెక్టివిటీ విద్యుదీకరణ కూడా పూర్తయింది. కస్టమ్స్‌ నోటిఫైడ్ ఏరియా పేరుతో ఆరు బయట ఖనిజ నిల్వ ప్రదేశాలు చుట్టూ ఎత్తయిన గోడలు నిర్మిస్తోంది. నీటి శుద్ధి కేంద్రాలు నిరంతరం పనిచేస్తున్నాయి. కానీ వాయు కాలుష్య తీవ్రత తగ్గడం లేదు. కాలుష్య వ్యాప్తిలో ఇతర పరిశ్రమల పాత్ర కూడా ఎక్కువగానే ఉంది. స్టీల్ ప్లాంట్, కోరమండల్, సింహాద్రి ధరˆల్, సెజ్, ఫార్మా సిటీలు, నాలుగు రిఫైనరీలు విపరీతంగా కాలుష్యాన్ని విడుదల చేస్తున్నాయి. మరో ప్రధాన కారణం వాహనాల ఉద్గారాలు (పొగ, తదితర వ్యర్ధాలు). ఉమ్మడి విశాఖ జిల్లాలో తిరిగేవి 90శాతం వాణిజ్య వాహనాలే! మొత్తం వాహనాల్లో, డీజిల్ వాహనాల సంఖ్య 92 వేలు. ఉమ్మడి రవాణా శాఖ ప్రాంతీయ కార్యాలయంలో 10.62 వాహనాలు నమోదయ్యాయి. వాయు కాలుష్య కారకాల్లో ప్రధానమైనవి, గాల్లో తేలియాడే సూక్షˆ ధూళికణాలు ( పి.ఎం.2.5, పి.ఎం 10).2024-26 ఏప్రిల్ మధ్య ‘రైస్ఫైర్ లివింగ్ సెన్స్స’ అనే హైదరాబాద్ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో, పి.ఎం 10 ( మైక్రో మీటర్లు), అంతకన్నా తక్కువ వ్యాసం కలిగి, గాల్లో తేలే అతి చిన్న ధూళికణాలు (పిఎం 2.5) కలసి,70.68 శాతం ఉన్నాయి. గడిచిన రెండేళ్లలో నైట్రోజన్ డయాక్సైడ్ స్థాయి 32 శాతం ఎక్కువగా పెరిగింది. కరుగుతున్న ఆకిస్జన్ స్థాయి అత్యధికంగా (21.6శాతం) నమోదయింది. 2017-18తో పోలిస్తే, 2024-25 లో కాలుష్యం 32.9 శాతం పెరిగింది. 2025 డిసెంబర్ 19న వాయు కాలుష్యం (ఎం.క్యూ-1) దిల్లీలో 316 పాయింట్లు నమోదు కాగా, విశాఖలో 350 పాయింట్లు నమోదయింది. ఇది ఎవ్వరూ విస్మరించరాని అత్యంత ప్రమాద ఘంటిక! విశాఖ వాయు కాలుష్య తీవ్రతను తగ్గించకపోతే, అంతర్జాతీయ పెట్టబడుల ఆకర్షణ ఎంతోకాలం నిలవదు. ఇది గమనించే, తన కాలుష్య నియంత్రణ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, మూలకారకాలను, మూలపేట పోర్టుకు తరలించాలని విశాఖ ప్రధాన పోర్ట్ ట్రస్ట్ నిర్ణయించింది. దీని వెనుక, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనల ప్రభావం కూడా, ఉంటే ఉండవచ్చు. బొగ్గు, ఐరన్ ఓర్ నిల్వలను, కొంతమేరకు మూలపేటకు తరలించాలని నిర్ణయిస్తూ, మరో వంక మూలపేట పోర్టు అభివృద్ధిలో భాగస్వామిగా మారాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించింది. రూ.1500 కోట్లు పెట్టుబడులుగా పెడతామని తెలిపింది. ఇప్పటికే, విశాఖ-భీమిలి నుంచి భోగాపురం ఎయిర్ పోర్ట్, మూలపేట పోర్టులకు కనెక్టివిటీని ఆరు లైన్ల హైవే నిర్మాణం ద్వారా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ ఎయిర్‌పోర్ట్ మూసివేత తరువాత, కార్గో సర్వీస్‌లను భోగాపురం, ఉద్దానం ఎయిర్‌పోర్టులకు మళ్లిస్తారు. చత్తీస్ఘడ్, జార్ఖండ్, ఒడిస్సా నుంచి మైనింగ్ ఉత్పత్తులను విశాఖ, గంగవరం పోర్టులకు రవాణా చేయకుండా, మూలపేటకు నేరుగా రవాణా చేయడానికి వీలుగా, రైల్వే కనెక్టివిటీని కొత్తగా పెంచుతున్నారు. నౌపడా జంక్షన్ నుంచి మూలపేటకు కొత్త రైల్వే లైన్ వేస్తారు. నౌపడ-గుణుపూర్ లైన్ను రాయగడ జిల్లాలోని వేదాంత, అదానీ మైనింగ్ సంస్థల కార్యకలాపాల కేంద్రమైన తెరుబలి వరకు విస్తరించే ప్రతిపాదన ఉంది. మరో వంక, జగదల్పూర్ నుంచి పాతపట్నం, నరసన్నపేట జంక్షన్ నుంచి మూలపేటకు ఆరు లైన్ల హైవేను ఏర్పాటు చేసే పనులు చురుగ్‌గా జరుగుతున్నాయి. మొత్తానికి, మూలపేట పోర్టును, ఉద్దానం ఎయిర్ పోర్టును ఈ ప్రయోజనాల కోసం నిర్మిస్తున్నారో, ఇప్పుడు అర్థమవుతుంది. విశాఖ మహా నగరాన్‌ని అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణ కోసం, కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దడానికి, మూలపేటను, ఉద్దానాన్ని బలి పశువులను చేస్తున్నారని స్పష్టమైంది. గత ఏప్రిల్‌లో, విశాఖ నోవాటెల్ హోటల్‌లో జరిగిన పోర్టు వాటాదారుల సమావేశంలో ఇదే విషయం, ఏమాత్రం దాపరికం లేకుండా, పోర్టు ట్రస్ట్ ఇన్‌చార్జ్ చైర్మన్ ఎం.అంగముత్తు ప్రకటించారు. ఆయన మాటల్లోనే “విశాఖలో వాయుకాలుష్యానికి కారణమవుతున్న బొగ్గు తదితర సరుకులను ఆ పోర్టుకు (మూలపేట) తరలిస్తాం”. సీనియర్ జర్నలిస్టు సెల్ : 76609 67313

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు