న్యూదిల్లీ: పాస్‌పోర్టు, ఆధార్ జాతీయతను తెలిపేవిగా పరిగణించకపోతే పౌరసత్వ గుర్తింపునకు మరి వేటిని ఆధారంగా తీసుకుంటారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పాస్‌పోర్టును పౌరసత్వం నిర్థారించే పత్రంగా పరిగణించడం లేదని, అది కేవలం విదేశీ ప్రయాణ అనుమతి పత్రమేనంటూ కేంద్రం స్పష్టం చేయడంపై కాంగ్రెస్ ఆయన స్పందించారు. పాస్‌పోర్ట్, ఆధార్లను ప్రభుత్వం ఉపసంహరించుకోనంత వరకు వాటిని పౌరసత్వాన్ని తెలిపే ఆధారాలుగా పరిగణించాలన్నారు. అందుకు వీలుగా చట్ట సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఆధార్ ప్రక్రియలో మార్పులు చేయండి…
ఆధార్ జారీ ప్రక్రియలోనూ కొన్ని మార్పులు చేస్తే బాగుంటుందని శశిథరూర్ కేంద్రానికి సూచించారు. ‘ప్రస్తుతం పౌరసత్వం ఆధారంగా ఆధార్ కార్డులను జారీ చేయడం లేదని ప్రభుత్వమే చెబుతోంది. కనీసం 182 రోజులు ఓ ప్రాంతంలో ఉంటే… వారు అధార్ పొందేందుకు అర్హులుగా పేర్కొంటోంది. భారతీయ పౌరసత్వం లేకపోయినా ఆధార్ ఇస్తున్నారు. ఈ సమస్యకు ఓ పరిష్కార మార్గాన్ని ఉంది. చూడగానే ఫలానా వ్యక్తి భారతీయ పౌరుడు కాదని గుర్తించేలా…ఆధార్ కార్డుపై భాగంలో అడ్డంగా ఎర్రని స్ట్రిప్ ఉండేలా ప్రత్యేక కార్డులను జారీ చేయాలి’ అని శశిథరూర్ సూచించారు. పాస్‌పోర్టు జారీ గురించి ఆయన ప్రస్తావిస్తూ ‘1967 నాటి పాస్‌పోర్టు చట్టంలోని సెక్షన్ 20 ప్రకారం…భారతీయ పౌరులు కానివారికీ పాస్‌పోర్టులు ఇస్తామని కేంద్రం చెబుతోంది. సాంకేతికంగా ఇది వాస్తవమే కావొచ్చు. కానీ, స్థానికులు, స్థానికేతరులకు తేడా ఏముంది. గత కొన్ని దశాబ్దాలుగా పాస్‌పోర్టును తిరుగులేని గుర్తింపు కార్డుగా పరిగణిస్తున్నాం. పోలీస్ వెరిఫికేషన్, పుట్టినప్పటి నుంచి ధ్రువపత్రాలను క్షణ్ణంగా పరిశీలించిన తర్వాతే పాస్‌పోర్టు జారీ చేస్తారు. ఇదంతా చేసిన తరువాత ఇది పౌరసత్వాన్ని నిర్ధరించేందుకు పనికిరాదని కేంద్రం చెప్పడంలో అర్థం లేదు. పాస్‌పోర్టు పౌరసత్వ గుర్తింపు కాకపోతే…భారతీయ పౌరులమని చెప్ప్పుకునేందుకు ఆధారం ఏంటి?’ అని శశిథరూర్ ప్రశ్నించారు. ఆధార్ కార్డు కేవలం గుర్తింపు కార్డు మాత్రమేని గతంలో సుప్రీంకోర్టు చెప్పడంతోనే చాలా మంది ప్రజలు గందరగోళానికి గురయ్యారని, తాజాగా పాస్‌పోర్టు విషయంలోనూ కేంద్రం అలాంటి ప్రకటన చేయడంతో అది మరింత పెరిగిందని శశిథరూర్ వ్యాఖ్యానించారు.
జాతీయత గుర్తించే ఆధారమేంటి?: శశిథరూర్
- Advertisement -


