Homeఅంతర్జాతీయంఆరని మంటలు…ఇరాన్‌పై మళ్లీ దాడులు

ఆరని మంటలు…ఇరాన్‌పై మళ్లీ దాడులు

- Advertisement -

వాషింగ్టన్: ఒక పక్క చర్చలు…మరో పక్క ఒప్పందాలు…ఇంకో పక్క నుంచి దాడులు ఇదీ అమెరికా తీరు. పశ్చిమాసియాలో ఇటీవల చల్లబడుతున్న ఉద్రిక్త వాతావరణం మళ్లీ మొదటికి వచ్చేలా కనిపిస్తోంది. ఇరాన్‌పై అమెరికా వరుసగా రెండో రోజు దాడులకు దిగింది. ఇరాన్ తిరగబడుతుండటంతో బదులుగా హోర్మూజ్ జలసంధి సమీపంలోని తెహ్రాన్ లక్ష్యాలపై యూఎస్ బలగాలు దాడులకు దిగాయి. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ ‘ఎక్స’ ద్వారా తెలిపింది. అధ్యక్షుడు ట్రంప్ డైరెక్షన్‌లో దాడులకు దిగినట్లు పేర్కొంది. ఇరాన్ నిఘా సదుపాయాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, గగనతల రక్షణ వ్యవస్థలు, డ్రోన్ల నిల్వల కేంద్రాలపై తమ యుద్ధ విమానాలు బాంబులు కురిపించినట్లు వెల్లడించింది. తొలుత ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కార్గో షిప్ ఎవర్ లవ్లీపై ఇరాన్ డ్రోన్ దాడి చేసిందని, దీనికి తాము బదులు తీర్చుకున్నట్లు సెంట్‌కామ్ తెలిపింది. అయితే కాల్పుల విరమణ ఉల్లంఘించకుండా ఉండేందుకు ఇరాన్‌కు అవకాశం ఇచ్చినా మళ్లీ ఆ దేశం దాడులు చేస్తోందని పేర్కొంది. రెండు మిలియన్ల బ్యారెళ్ల చమురుతో పనామా జెండాతో వెళుతున్న కికు ట్యాంకర్‌పై ఇరాన్ డ్రోన్ దాడి చేసినట్లు అమెరికా బలగాలు వెల్లడించాయి. దీంతో తాము తాజాగా దాడులు చేసినట్లు పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్టు చేసింది. ఇరాన్ దాడులు ఇలాగే కొనసాగితే తీవ్రంగా విరుచుకుపడుతామని ట్రంప్ హెచ్చరించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘిస్తోందని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు