మాస్కో: రష్యాఉక్రెయిన్ నేపథ్యంలో అమెరికాతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని రష్యా తెలిపింది. ఉక్రెయిన్‌తో ఘర్షణలను ముగించేలా అమెరికాతో చర్చలు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. అమెరికాఇరాన్ ఒప్పందం ఒక కొలిక్కి వచ్చిన అనంతరం అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్ తమ దేశంలో పర్యటిస్తారని భావిస్తున్నట్లు పుతిన్ చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. గత సంవత్సరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-పుతిన్ మధ్య అలస్కాలో చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. వాటి గురించి రష్యా అధ్యక్షుడు మాట్లాడుతూ ఒప్పందాలు కుదరకపోయినా…గతంలో చర్చించిన అంశాలపై చర్చలు కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇదిలాఉండగా, కొంతకాలంగా రష్యా ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులు చేస్తోంది. దీంతో రష్యాకు చెందిన స్లావ్యాన్స్కీ, యారోస్లావ్ల్ చమురు శుద్ధి కర్మాగారాలు దెబ్బతిన్నాయి. ఈ దాడులతో రష్యాలో ఇంధన కొరత ఏర్పడింది. ఈ విషయాన్ని తొలిసారి పుతిన్ అంగీకరించారు. చమురు కేంద్రాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని, ఉత్పత్తి పెంచుతామని వెల్లడించారు. నాలుగేళ్లకు పైగా సాగుతోన్న రష్యా-ఉక్రైన్ యుద్ధానికి జరపడాలని ఆసియా దేశాలతో పాటు ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో చర్చలకు రష్యా ముందుకు రావడం శుభ పరిణామంగా భావించవచ్చు.
అమెరికాతో చర్చలకు సిద్ధం: రష్యా
- Advertisement -


