Homeఆంధ్రప్రదేశ్ఏపీలో లక్షన్నర హెక్టార్లలో బంగారు ఖనిజ నిక్షేపాలు..

ఏపీలో లక్షన్నర హెక్టార్లలో బంగారు ఖనిజ నిక్షేపాలు..

- Advertisement -

14 ప్రాంతాలను ఎంపిక చేసిన గనులశాఖ
ఆంధ్రప్రదేశ్‌లోని 14 ప్రాంతాల్లో సుమారు 1.58 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో బంగారు నిక్షేపాలు ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం ఖనిజ తవ్వకాలు ప్రారంభమై ఉత్పత్తి కొనసాగుతుండగా, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో కూడా విస్తృత స్థాయిలో ఖనిజాన్వేషణ చేపడితే బంగారు నిల్వలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ ఖనిజాన్వేషణ అభివృద్ధి ట్రస్ట్ (ఎన్‌ఎంఈటీ) నిధులతో ఆయా ప్రాంతాల్లో అన్వేషణ పనులను వేగవంతం చేస్తున్నారు.

నాలుగు దశల్లో బంగారం అన్వేషణ
బంగారు ఖనిజాన్ని గుర్తించే ప్రక్రియను నాలుగు దశల్లో నిర్వహిస్తారు. మొదట మట్టి, రాళ్లను పరిశీలించి ఆ ప్రాంతంలో బంగారు ఖనిజం లభించే అవకాశాలను అంచనా వేస్తారు. ఈ దశను జియోలాజికల్-4 (జీ-4)గా పిలుస్తారు. తర్వాత సగటున ప్రతి 400 మీటర్లకు ఒక బోర్‌హోల్ తవ్వి భూమి లోపలి నుంచి నమూనాలను సేకరించి పరీక్షిస్తారు. దీనిని జీ-3 దశగా పేర్కొంటారు.ఈ పరీక్షల్లో కూడా అనుకూల ఫలితాలు వస్తే జీ-2 దశకు అనుమతి ఇస్తారు. ఇందులో ప్రతి 200మీటర్ల దూరానికి ఒక బోర్‌హోల్ ఏర్పాటు చేసి మరింత లోతుగా అన్వేషణ నిర్వహిస్తారు. ఈ దశ కూడా విజయవంతమైతే ఖనిజ లీజులు మంజూరు చేసి వాణిజ్యపరమైన తవ్వకాలకు అనుమతులు ఇస్తారు. ఈ తుది దశను జీ-1గా గుర్తిస్తారు.

జౌకులలో 5 వేల హెక్టార్లలో రెడీ
శ్రీ సత్యసాయి జిల్లా నంబలపూలకుంట మండలంలోని జౌకుల గ్రామ పరిధిలో మొత్తం 6 వేల హెక్టార్లను వెయ్యి హెక్టార్ల చొప్పున ఆరు బ్లాక్‌లుగా విభజించారు. ఇందులో ఎఫ్ బ్లాక్‌లో మెగా సోలార్ పార్క్ భూములు ఉండటంతో ప్రస్తుతం అక్కడ అన్వేషణ చేపట్టడం లేదు. మిగిలిన ఐదు బ్లాక్‌లలో ఖనిజాన్వేషణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎ-బ్లాక్‌లో క్రిటికల్ మినరల్ ట్రాకర్స్, బి-బ్లాక్‌లో జెమ్‌కో కటి ఎక్స్‌ప్లోరేషన్, సి-బ్లాక్‌లో భుష్లిప్ మైన్స్ అండ్ మినరల్స్, డి-బ్లాక్‌లో జెమ్స్ ప్రాజెక్ట్స్, ఇ-బ్లాక్‌లో జియో ఎక్స్‌ప్లోర్ సంస్థలు అన్వేషణ చేపట్టనున్నాయి. ఈ సంస్థలు ప్రాథమిక నివేదికలను సిద్ధం చేసి ఎన్‌ఎంఈటీకి సమర్పించనున్నాయి. అనంతరం ఎన్‌ఎంఈటీ నుంచి ఆర్థిక సహాయంతో తదుపరి దశల అన్వేషణ కొనసాగుతుంది.

రామగిరిలో రెండు బ్లాక్స్‌లో 2వేల హెక్టార్లు
శ్రీసత్యసాయి జిల్లా రామగిరిలో గతంలో భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (బీజీఎంఎల్) గనులు పనిచేశాయి.
ప్రస్తుతం వాటికి ఆనుకుని ఉన్న 2 వేల హెక్టార్లను ఉత్తర, దక్షిణ బ్లాక్‌లుగా విభజించి మళ్లీ ఖనిజాన్వేషణ చేపట్టేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతంలో జీ-4 దశ అన్వేషణ నిర్వహించేందుకు గతంలో ముంబయికి చెందిన ఆంధ్రా మైనింగ్ కార్పొరేషన్ ముందుకు వచ్చింది. అదే జిల్లాలోని రొద్దం మండలం బొక్సంపల్లి ఉత్తర, దక్షిణ బ్లాక్‌లలో సుమారు 1,740 హెక్టార్లలో బంగారు నిల్వలు ఉండే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) ఆధ్వర్యంలో జీ-3 దశ ఖనిజాన్వేషణ కొనసాగుతోంది.

చిగురుగుంటలో 12,500 కేజీల నిల్వలు
చిత్తూరు జిల్లా చిగురుగుంట, బి. సనత్తం ప్రాంతాల్లోని 273 హెక్టార్లలో సుమారు 22 లక్షల టన్నుల బంగారు ఖనిజం ఉన్నట్లు గత అధ్యయనాల్లో గుర్తించారు. ప్రతి టన్ను ఖనిజం నుంచి సగటున 5.64 గ్రాముల బంగారం లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం అక్కడ మొత్తం 12,500 కిలోల బంగారం నిల్వలు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. గతంలో ఈ ప్రాజెక్టును కేంద్ర ఖనిజాభివృద్ధి సంస్థకు అప్పగించినప్పటికీ తవ్వకాలు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం ఈ గనులను ఈ-వేలం ద్వారా కేటాయించే ప్రక్రియ కొనసాగుతోంది. గనులు ప్రారంభమైతే ఏడాదికి 600 నుంచి 1,000 కిలోల వరకు బంగారం ఉత్పత్తి చేసే అవకాశం ఉందని అంచనా.

జొన్నగిరిలో ఇప్పటికే బంగారం ఉత్పత్తి
కర్నూలు జిల్లా జొన్నగిరిలో జియో మైసూర్ సంస్థకు 1,400 హెక్టార్లలో ఖనిజాన్వేషణ, తవ్వకాల కోసం అనుమతులు ఇచ్చారు. సంస్థ ఇప్పటికే బంగారం ఉత్పత్తిని ప్రారంభించింది. ప్రస్తుతం ప్రతి టన్ను ఖనిజం నుంచి సుమారు 1.5 గ్రాముల బంగారం ఉత్పత్తి అవుతోంది. ఈ లీజు పరిధిలో 15 వేల కిలోల వరకు బంగారం నిల్వలు ఉండే అవకాశం ఉందని అంచనా. ప్రస్తుతం సంస్థ ఏడాదికి 400 కిలోల బంగారం ఉత్పత్తి లక్ష్యంగా కార్యకలాపాలు కొనసాగిస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు