సినిమాలో ట్విస్ట్‌లు ఊహలకి అందవు: నాగార్జున
సినిమా: సునీల్, శివాజీ, అఖిల్, భాగ్యశ్రీ, నాగార్జున, బ్రహ్మాజీ, సూర్యదేవర నాగవంశీ
‘సీమలో జరుగుతున్న మహాభారతమే ‘లెనిన్’ సినిమా. ఇందులో అఖిల్ ఎక్కడా కనిపించడు. లెనిన్ మాత్రమే కనిపిస్తాడు. ఈ సినిమా చూశాక అతన్ని అందరూ తమ ఇళ్లకు తీసుకెళ్లిపోతారు’ అన్నారు ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున. అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ జంటగా నటించిన ఈ చిత్రాన్ని మురళీ కిశోర్ అబ్బూరు తెరకెక్కించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. 10న విడుదల కానున్న నేపథ్యంలో ఆదివారం రాత్రి తిరుపతిలో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ‘మురళీ ఈ స్క్రిప్ట్ వినిపించడానికి వచ్చినప్పుడు…ఇది శ్రీరామాపురంలో జరిగే కథని చెప్పారు. మా నాన్న పుట్టిన ఊరు పేరు కూడా అదే అవడంతో కాస్త సెంటిమెంట్‌గా అనిపించింది. కథ విన్నాక చాలా పాత్రలు, విభిన్న కోణాలు కనిపించాయి. దీంట్లోని ట్విస్ట్‌లు కచ్చితంగా ఎవరి ఊహలకీ అందవు. ఇందులో ఓ అందమైన ప్రేమకథ ఉంది, భారతి పాత్ర గుండె చప్ప్పుడులా ఉంటుంది. ఆ పాత్రని భాగ్యశ్రీ చాలా అద్భుతంగా పోషించింది. ఇది రాయలసీమ నేపథ్యంలో సాగే కథ అని నాగార్జున వివరించారు.
అఖిల్ సెట్ అవుతాడా లేదా అని భయపడ్డా…
‘ఇంతవరకు అర్బన్ కథలే చేసిన అఖిల్ ఈ చిత్రానికి సెట్ అవుతాడా అని కాస్త భయపడ్డా. కానీ, ఈ సినిమా చూశాక నేనే కాదు, అందరూ ఆశ్చర్యపోయారు. అఖిల్ లెనిన్‌గా మారిపోయాడు. ఈ సినిమా చూశాక ప్రతి ఒక్కరూ లెనిన్ స్నేహాన్ని, అతని ప్రేమను, తన పగను ప్రేమిస్తారు. అతన్ని మీతో పాటు ఇళ్లకు తీసుకెళ్లిపోతారు. మాకూ అదే సంతోషం. 10న వస్తున్నాం… మనవాడు హిట్ కొడుతున్నాడు’ అని నాగార్జున తన సంతోషాన్ని పంచుకున్నారు.
నటుడు శివాజీ మాట్లాడుతూ ఓ సోషల్ భారతం ఎలా ఉంటుందో ఈ చిత్రంతో అందరూ చూస్తారన్నారు. హీరో అఖిల్ మాట్లాడుతూ రెండున్నరేళ్ల విరామం తరువాత ఈరోజు ఒక సానుకూల దృక్పథంతో ఇక్కడికి వచ్చాను. దానికి కారణమే ఈ ‘లెనిన’. ప్రతి ఒక్కరూ నన్ను తమ ఇళ్లకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ చిత్రం చేశాను. నా బాధ, నా ప్రయాణమంతా దీంట్లో కనిపిస్తాయన్నారు. తమన్ ఈ చిత్రానికి తన సంగీతంతో ప్రాణం పోశాడు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ, భాగ్యశ్రీ, సునీల్, బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు.
సీమలో జరుగుతున్న మహాభారతమే ‘లెనిన్’
- Advertisement -


