దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైలు ప్రయాణికులకు శుభవార్త. రైలు టికెట్ల బుకింగ్ కోసం వినియోగించే ఐఆర్‌సీటీసీ (ఐఆర్‌సీటీసీ) వెబ్‌సైట్‌ను భారతీయ రైల్వే శాఖ సమూలంగా మారుస్తోంది. ఇందులో భాగంగా సరికొత్త ఫీచర్లతో మరింత వేగంగా, సులభంగా పనిచేసేలా రూపొందించిన కొత్త వెబ్‌సైట్ బీటా వెర్షన్‌ను జులై 15న ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం ఉన్న వెబ్‌సైట్‌తో పోలిస్తే ఇది చాలా వేగంగా, ఎలాంటి గందరగోళం లేకుండా పనిచేస్తుందని అధికారులు తెలిపారు.
విద్యార్థుల సూచనలతో మార్పులు
ప్రస్తుత ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసేటప్పుడు తరచూ క్యాప్చాలు రావడం, అనవసరమైన పాపప్‌లు, బుకింగ్‌లో జాప్యం వంటి సమస్యలు ఉన్నాయని జైపూర్‌లోని మాలవీయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎన్ఐటీ) విద్యార్థులు గతంలో రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్లారు. గత నెలలో వారితో జరిగిన సమావేశంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, వెబ్‌సైట్‌ను తప్పకుండా ఆధునికీకరిస్తామని హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే, ఐఆర్‌సీటీసీ, సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సీఆర్ఐఎస్) అధికారులు శుక్రవారం జైపూర్‌లో విద్యార్థులకు కొత్త బీటా వెర్షన్‌ను ప్రదర్శించి, వారి నుంచి మరిన్ని సూచనలు స్వీకరించారు. ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు స్పష్టం చేశారు.
కొత్త వెబ్‌సైట్‌లో ప్రధాన మార్పులివే:
రైల్వే అధికారులు వెల్లడించిన ప్రకారం, కొత్త వెబ్‌సైట్‌లో నాలుగు కీలకమైన మెరుగుదలలు చేశారు.
1.క్యాప్చాలు, పాపప్‌లకు చెక్: టికెట్ బుకింగ్ సమయంలో ఇబ్బంది పెట్టే అనవసరమైన క్యాప్చాలు, పాపప్‌లు, ఫ్లాషింగ్ గ్రాఫిక్స్‌ను గణనీయంగా తగ్గించారు. ఇది ప్రయాణికులకు సాఫీ బుకింగ్ అనుభూతిని ఇస్తుంది.
2.ఒకే స్క్రీన్‌పై సీట్ల లభ్యత: ప్రస్తుతం వేర్వేరు క్లాసుల్లో సీట్ల లభ్యతను చూసేందుకు పలుమార్లు క్లిక్ చేయాల్సి వస్తోంది. కొత్త వెబ్‌సైట్‌లో అన్ని క్లాసుల్లోని సీట్ల లభత్యత వివరాలు ఒకే స్క్రీన్‌పై కనిపిస్తాయి.
3.వేగవంతమైన చెక్-అవుట్: బుకింగ్ పూర్తి చేయడానికి ప్రస్తుతం చాలా దశలు దాటాల్సి వస్తోంది. కొత్త వెబ్‌సైట్‌లో ఈ దశల సంఖ్యను తగ్గించి, బుకింగ్ ప్రక్రియను వేగవంతం చేశారు.
4.సులభంగా రిపీట్ బుకింగ్: తరచుగా ప్రయాణించే వారి కోసం, ఒకసారి సేవ్ చేసిన ప్రయాణికుల వివరాలతో మళ్లీ మళ్లీ సులభంగా టికెట్లు బుక్ చేసుకునే సౌకర్యం కల్పించారు.
పూర్తిస్థాయి వెర్షన్ త్వరలో…
ప్రస్తుతం ఈ బీటా వెర్షన్‌ను భారతీయ రైల్వే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్ఎస్)తో అనుసంధానిస్తున్నారు. సుమారు 40 ఏళ్ల నాటి ఈ పీఆర్ఎస్ ఇంజిన్‌ను కూడా అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంది. ఆ ప్రక్రియ పూర్తయ్యాక, రాబోయే కొన్ని నెలల్లో పూర్తిస్థాయి కొత్త వెబ్‌సైట్ అందుబాటులోకి వస్తుందని రైల్వే వర్గాలు తెలిపాయి. మరోవైపు, రైల్వే సేవలకు సంబంధించిన ఃరైల్‌వన్ః యాప్ ఇప్పటికే 4 కోట్లకు పైగా డౌన్‌లోడ్‌లను దాటిందని, తత్కాల్ బుకింగ్ సమయంలో బాట్‌ల బెడదను అరికట్టేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు. 2002లో ఆన్‌లైన్ బుకింగ్ ప్రారంభమైనప్పటి నుంచి, దేశంలో దాదాపు 88% రైలు టికెట్లు ఆన్‌లైన్‌లోనే బుక్ అవుతుండటంతో, వెబ్‌సైట్ ఆధునికీకరణపై రైల్వే శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.


