మిశ్రాకు టికెట్ దక్కకపోవడంతో దాటియాలో చెలరేగిన అల్లర్లు
దాటియా (మధ్యప్రదేశ్): ఉపఎన్నిక నేపథ్యంలో దాటియా అసెంబ్లీ పరిధిలో అల్లర్లు చెలరేగాయి. దాటియా ఉపఎన్నికకు తమ పార్టీ అభ్యర్థిగా అశుతోష్ తివారిని బీజేపీ అధిష్ఠానం ప్రకటించడంతో వివాదం మొదలైంది. మాజీ హోంమంత్రి నరోత్తం మిశ్రాకు టికెట్ దక్కకపోవడంతో ఆయన అనుచరులు శుక్ర, శనివారాల్లో భారీఎత్తున ఆందోళనకు దిగారు. సుమారు 3 వేల మందికి పైగా కార్యకర్తలు జాతీయ రహదారి (ఎన్‌హెచ్-44)పై బైఠాయించారు. దాదాపు 12 గంటల పాటు రహదారిని దిగ్బంధించి నిరసన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎస్‌పీ సహా పోలీసు సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. పోలీసులపై నిరసనకారులు రాళ్ల దాడికి దిగారు. ఈ దాడిలో జిల్లా ఎస్‌పీ, ఇతర ఉన్నతాధికారులు సహా పలువురు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. పోలీసు వాహనాలతో పాటు ఇతర వాహనాలనూ ఆందోళనకారులు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు భాష్ప వాయువులు ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
ఇలా జరిగింది…
2023 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో దాటియా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా అప్పటి రాష్ట్ర హోంమంత్రి నరోత్తం మిశ్రా పోటీ చేశారు. కాంగ్రెస్ తరఫున రాజేంద్ర భారతి బరిలో దిగారు. రాజేంద్ర భారతి చేతిలో 7,500కు పైగా ఓట్ల తేడాతో మిశ్రా ఓటమి పాలయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓ కేసులో రాజేంద్ర భారతికి దిల్లీ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన ఎమ్మెల్యే పదవికి అనర్హుడయ్యారు. ఈ మేరకు దాటియా స్థానానికి ఉపఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఉపఎన్నికలో తనకే మరోసారి అవకాశం వస్తుందని నరోత్తం మిశ్రా భావించారు. ఆ ధీమాతో నామినేషన్ పత్రం కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే, బీజేపీ అధిష్ఠానం మాత్రం అనూహ్యంగా అశుతోశ్ తివారిని అభ్యర్థిగా ప్రకటించింది. అధిష్ఠానం నిర్ణయం మిశ్రా అనుచరులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. దీంతో ఆయన మద్దతుదారులు, వేలాది మంది కార్యకర్తలు ఎన్‌హెచ్-44పై బైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు. పోలీసులు పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఆందోళన విరమించకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఉపఎన్నికలో సీటు రాలేదని బీజేపీలో రగడ
- Advertisement -
RELATED ARTICLES


