ఫైజాబాద్ (అయోధ్య) న్యాయవాదుల సంఘం రెండు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. మొదటిది: రామ మందిర తీర్థ ట్రస్ట్‌కు భక్తులు చెల్లించిన సొత్తు చోరీలో ఆరోపణలకు గురై అరెస్టైన వారి కేసులు ఏ న్యాయవాదీ వాదించకూడదని. రెండోది: మొన్నటి దాకా రామ మందిర తీర్థ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న చంపత్ రాయ్, ట్రస్ట్ మాజీ సభ్యులు అనిల్ మిశ్రా, గోపాల్ రావ్ పై ఎఫ్.ఐ.ఆర్. దాఖలు చేయించేలా ఆదేశించాలని స్థానిక న్యాయస్థానాన్ని అభ్యర్థించడం. ఆరోపణలకు గురైన వారెవరైనా తమ వాదన వినిపించే అవకాశం ఉండాలి. ఈ వివాదంలో అరెస్టైన ఎనిమిది మందికి కూడా తమ వాదన వినిపించే హక్కు ఉండి తీరాల్సిందే. వారి తరఫున ఏ న్యాయవాదీ వాదించకూడదని అనుకోవడం ఈ మౌలిక న్యాయ సూత్రానికి విరుద్ధమైంది. ఇది వారి ఆక్రోశం తీవ్రతను తెలియజేస్తోందని మాత్రం అంగీకరించాల్సింది. చంపత్ రాయ్, అనిల్ మిశ్రా, గోపాల్ రావు పై ఎఫ్.ఐ.ఆర్. నమోదు అయ్యేట్టు చూడాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించాలని అయోధ్య న్యాయవాదుల సంఘం తీసుకున్న నిర్ణయం వారి సామాజిక చైతన్యానికి, బాధ్యతకు నిదర్శనం. ఇది న్యాయవాదులు ధర్మ పక్షాన నిలబడాలని నిర్ణయించుకున్నారనడానికి తార్కాణం. నిజానికి ఫైజాబాద్ న్యాయవాదుల సంఘం అసలు నిందితులపై ఎఫ్.ఐ.ఆర్. దాఖలు చేయాలని కోరుతూ గత రెండవ తేదీననే రామ జన్మ భూమి పోలీసు స్టేషన్ అధికారులకు ఓ ఫిర్యాదు అందజేసింది. ఏలిన వారి ఆజ్ఞ లేనిదే కదిలే అలవాటు లేని పోలీసులు ఎఫ్.ఐ.ఆర్. దాఖలు చేయలేదు. చంపత్ రాయ్ మొదలైన వారి మీద రెండు వారాలలోగా ఎఫ్.ఐ.ఆర్. దాఖలు చేయాలని అయోధ్య న్యాయవాదుల సంఘం పోలీసులను కోరింది. న్యాయవాదుల అభ్యర్థనను సదరు పోలీసు స్టేషన్ అధికారులు పై అధికారులకు పంపించారట. ప్రతి కేసులోనూ పోలీసులు ఇలా పై అధికారులకు పంపించరు. కానీ ఇది పెద్ద తలకాయల ప్రమేయం ఉన్న బందిపోటు కనక తమ మీద మాట రాకుండా ఫిర్యాదు అంశాన్ని పై అధికారులకు విన్నవించారు. పోలీసులకూ కష్టాలు ఉంటాయి మరి. సోమవారం న్యాయవాదుల బృందం పోలీసుస్టేషన్‌కు వెళ్లి వాకబు చేస్తే ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయలేదన్న కబురు అందింది. చంపత్ రాయ్, ఆయన సహచరుల మీద కేసు నమోదైతే వాదించడానికి అయోధ్య న్యాయవాదుల సంఘం 21 మంది న్యాయవాదులతో ఓ కమిటీ ఏర్పాటుచేసింది. ఫైజాబాద్ న్యాయవాదుల సంఘం జులై రెండో తేదీన నిరసన ప్రదర్శన నిర్వహించారు. చంపత్ రాయ్, అనిల్ మిశ్రా, గోపాల్ రావుపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయాలని పోలీసు అధికారులను కోరారు. కానీ పోలీసు అధికారులు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయలేదని చెప్పడంతో ఇప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయించాలని అభ్యర్థిస్తామంటున్నారు. అయోధ్య న్యాయవాదుల సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించి అరెస్టైన ఆ ఎనిమిది తరఫున ఏ న్యాయవాదీ కోర్టులో వాదించకూడదని నిర్ణయించింది. ఒక వేళ ఎవరైనా సాహసించి వాదిస్తే వారికి అయిదు లక్షల రూపాయల జరిమానా విధించాలని, న్యాయవాదుల సంఘం నుంచి బహిష్కరించాలని కూడా నిర్ణయించారు. అయోధ్య న్యాయవాదుల సంఘం ఇంత తీవ్ర నిర్ణయం తీసుకోవడం అంటే రామ మందిర నిధుల దోపిడీకి కారకులైన వారికి ఎలాగైనా శిక్ష విధించేట్టు చేయాలన్న సంకల్ప బలం కనిపిస్తోంది. ఏ కేసులో అయినా రెండు పక్షాల తరఫున న్యాయవాదులు ఉంటారు. అంతిమంగా న్యాయం ఒక వేపే ఉంటుందని తెలిసినా ఆరోపణలకు గురైన వారి తరఫున నిలబడడం న్యాయవాదులు తమ ధర్మంగా భావిస్తారు. చాలా అరుదైన సందర్భాలలో మాత్రమే ఆరోపణలకు గురైన వారి తరఫున వాదించకూడదన్న పట్టుదలతో ఉన్నారు. అంతమాత్రం చేత ఆ ఎనిమిది మంది తరఫున వాదించే న్యాయవాదే ఉండరనీ అనుకోలేం.మరో ట్రస్ట్ సభ్యుడు కృష్ణమోహన్ శ్రీరాముడి సొత్తు దోపిడీ చేసిన వారి మీద ఫిర్యాదు చేశారు. తరవాత ఆయననే చంపత్ రాయ్ స్థానంలో నియమించారు. ఆ కృష్ణమోహన్ మీద కూడా ఎఫ్.ఐ.ఆర్. దాఖలు చేయాలని అయోధ్య న్యాయవాదుల సంఘం కోరుతోంది. ఇందులో ఓ సబబు కనిపిస్తోంది. అసలు మొత్తం ట్రస్టే దోపిడీకి కారణం అన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. కానీ ఈ తీవ్ర ఆరోపణలను ఖాతరు చేయకుండా గత వారం జరిగిన ట్రస్ట్ సమావేశంలో చంపత్ రాయ్, అనిల్ మిశ్రా సమర్పించిన రాజీనామాలను మాత్రం ఆమోదించారు. అపఖ్యాతి పాలైన అదే ట్రస్టులో సభ్యుడిగా ఉన్న వ్యక్తికి బాధ్యతలు అప్పగించారు. తదుపరి ప్రధాన కార్యదర్శి పేరు సూచించడానికి ముగ్గురు సభ్యుల కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యనిర్వహణాధికారిని నియమిస్తారట. ఈ దోపిడీని నిశితంగా గమనిస్తున్న వారందరూ మొత్తం ట్రస్టుకే దోపిడీతో సంబంధం ఉందని భావిస్తున్నారు. కానీ ఆ ట్రస్ట్లోనే కొందరికి మళ్లీ బాధ్యతలు అప్పగించడం అంటే అసలు ద్రోహులను పట్టుకోవడానికి అవకాశం లేకుండా ట్రస్ట్ సకల కట్టుదిట్టాలూ చేస్తోందన్న మాట. ఈ దోపిడీకి అసలు బాధ్యులు ఎవరో అన్న విషయం అంతా న్యాయంగా జరిగితే ఎప్పుడో ఒకప్పుడు తేలవచ్చు. కానీ లక్నోలో గద్దె మీద ఉన్న వారి దగ్గరి నుంచి, దిల్లీ గద్దె మీద ఉన్న వారి దాకా చాలా పేద్ద తలకాయలకు ఈ దోపిడీలో పాత్ర ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. అందువల్ల ట్రస్ట్ తీసుకునే నిర్ణయాలన్నీ వివాదాస్పదంగానే మిగిలిపోతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రామ మందిర తీర్థ ట్రస్ట్ ఒకే వైఖరి అనుసరిస్తున్నాయి. యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సమర్పించిన ప్రాథమిక నివేదికను చూస్తే అసలు దొంగలను తప్పించడానికి సకల ఏర్పాట్లూ చేశారనిపిస్తోంది. తాము త్వరితగతిన “సిట్” ఏర్పాటుచేశామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ఆ “సిట్” అధినేత విజయ్ విశ్వాస్ పంత్ మీదే లెక్కలేనన్ని ఆరోపణలున్నాయి. ఆయన మీద భారత శిక్ష± స్మృతి (ఇది వరకు ఐ.పి.సి.) లోని 420వ సెక్షన్ కింద దాఖలైన కేసు ఇప్పటికీ కొనసాగుతోంది. గంగా పుష్కరాలు జరిగినప్పుడు ఆయన తెల్లవారుఝ²ముననే గంగా నది ఒడ్డున ఉన్న పుష్కర ఘాట్లకు వెళ్లి ఓ మైక్ పుచ్చుకుని “భక్తులారా లేవండి. పుష్కర స్నానాలు ఆచరించి ముక్తి పొందండి” అని ప్రకటించిన ఐ.ఎ.ఎస్. అధికారి. రామ మందిర నిధుల దోపిడీలో ఆయన నాయకత్వంలోని “సిట్” 22వ తేదీన తుది నివేదిక సమర్పిస్తుందట. అందులోనూ ఏనుగులను వదిలేసి మహా అయితే ఎలుకలను పట్టుకోవచ్చు. ఈ స్థితిలో అయోధ్య నాయవాదులు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రశంసించవలసిందే.


