*ఏళ్ల తరబడి వెట్టి బతుకులు
*అర్ధాకలితో రాత్రింబగళ్లు పనులు
*బాలకార్మికులుగా కూలీల పిల్లలు
(విశాలాంధ్ర-చిత్తూరు)
మనం నివసించే అందమైన భవనాలు, బహుళ అంతస్తుల మేడల వెనుక ఎందరో అభాగ్యుల రక్తం, చెమట దాగున్నాయి. మండుతున్న ఎండలను లెక్కచేయకుండా, చలికి వణుకుతూ, బురదలో మగ్గుతూ ఇటుకలు తయారు చేసే కార్మికుల జీవితాలు నేడు అత్యంత దయనీయంగా మారాయి. ఐరాల మండలం పొలకల పంచాయతీ పరిధిలోని చిన్న సామిరెడ్డిపల్లి సమీపంలో అనంతపురం జిల్లా నుంచి వలస వచ్చిన ఇటుక కార్మికుల బతుకులు ఇందుకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఆధునిక సమాజంలో సాంకేతికత ఎంత పెరిగినా, వీరి బతుకుల్లో మాత్రం చీకట్లు తొలగడం లేదు.
ఏళ్ల తరబడి వెట్టి బతుకులు
గ్రామాల్లో సరైన ఉపాధి లేక, కరువు రక్కసి కోరల్లో చిక్కుకుని బతుకుతెరువు కోసం వలస వచ్చిన ఈ కార్మికులు ఇటుక బట్టీల యజమానుల వద్ద ఏళ్ల తరబడి వెట్టి చాకిరీ చేస్తున్నారు. సొంత ఊరిని, కన్నవారిని వదిలి ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న బట్టీల వద్దకు చేరిన వీరికి స్వేచ్ఛ అనేది మచ్చుకైనా కనిపించదు. ఇటుక బట్టీ నిర్వాహకులు ఇచ్చే అరకొర ముందస్తు అడ్వాన్సుల కు ఆశపడి, తమ జీవితాలను వారి వద్ద తాకట్టు పెడుతున్నారు. ఆ రుణం తీరక, అప్పుల ఊబి నుంచి బయటపడలేక ఏళ్ల తరబడి అదే నరకంలో మగ్గిపోతున్నారు. అడగడానికి గొంతుక లేక, శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కక, బానిసల కంటే హీనంగా వీరి వెట్టి బతుకులు సాగుతున్నాయి.
అర్ధాకలితో రాత్రింబగళ్లు పనులు
ఇటుక కార్మికులకు పని వేళలంటూ ఏమీ ఉండవు. సూర్యుడు ఉదయించక ముందే మొదలయ్యే వీరి శ్రమ, అర్ధరాత్రి దాటినా ముగియదు. ఎండ వేడిమికి ఇటుకలు ఎండిపోతాయనే కారణంతో చాలా చోట్ల రాత్రి వేళల్లో, తెల్లవారుజామున చీకట్లోనే లైట్ల వెలుతురులో పని చేయిస్తారు. మట్టి తొక్కడం, అచ్చుల్లో వేయడం, ఎండబెట్టడం, బట్టీల్లో పేర్చడం వంటి ప్రతి పనిలోనూ కఠినమైన శ్రమ దాగి ఉంటుంది. ఇంత కష్టపడినా వీరికి దక్కేది అర్ధాకలి బతుకే. పౌష్టికాహారం లేక, కనీసం తాగడానికి స్వచ్ఛమైన నీరు దొరకక అనారోగ్యాల బారిన పడుతున్నారు. సరైన వసతి సౌకర్యాలు లేని చిన్న చిన్న పూరి గుడిసెల్లో, ప్లాస్టిక్ షీట్ల కింద దోమలు, పాముల భయాల మధ్య వీరు కాలం వెళ్లదీస్తున్నారు.
బాలకార్మికులుగా కూలీల పిల్లలు
అతి పెద్ద విషాదం ఏమిటంటే, ఈ వలస బతుకుల్లో చిన్నారుల భవిష్యత్తు పూర్తిగా బురదపాలవుతోంది. తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేందుకు, లేదా బట్టీ యజమానుల ఒత్తిడి తట్టుకోలేక చిన్నారి చేతులు కూడా మట్టి పిసుకుతున్నాయి. అక్షరాలు దిద్దాల్సిన వయసులో ఇటుకలు మోస్తున్నారు. బడికి వెళ్లాల్సిన పిల్లలు ఇలా బాలకార్మికులుగా మారుతుండటంతో వీరి తరం విద్యాగంధానికి దూరమవుతోంది. ఆటపాటలతో గడపాల్సిన బాల్యం, ఇటుక బట్టీల పొగచూరిన వాతావరణంలో కరిగిపోతోంది. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా, ఈ అట్టడుగు వర్గాల పిల్లల వరకు విద్యా హక్కు చట్టం చేరడం లేదనడానికి ఈ దృశ్యాలే నిదర్శనం.
పాలకులు కళ్లు తెరిచేదెన్నడు?
శ్రమ దోపిడీకి గురవుతున్న ఈ అనాథ శ్రామికుల వైపు ప్రభుత్వాలు, కార్మిక శాఖ అధికారులు కన్నెత్తి చూడకపోవడం విచారకరం. కనీస వేతన చట్టాలు, కార్మిక సంక్షేమ పథకాలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరవాలి. ఐరాల మండలంలోని ఇటుక బట్టీలపై తక్షణమే తనిఖీలు చేపట్టి, వెట్టి చాకిరీ నుండి కార్మికులను విముక్తి చేయాలి. వలస కార్మికుల పిల్లల కోసం ప్రత్యేక విద్యా వసతులు కల్పించాలి. వారి ఆరోగ్య రక్షణకు, కనీస వేతనాల అమలుకు గట్టి చర్యలు తీసుకోకపోతే, ఈ “మట్టి మనుషుల” జీవితాలు శాశ్వతంగా ఆ ఇటుకల బట్టీల్లోనే బూడిదైపోతాయి.


