Homeజాతీయండిమాండ్లు నెరవేరేవరకు నిరసనలు ఆగవు: సీజేపీ

డిమాండ్లు నెరవేరేవరకు నిరసనలు ఆగవు: సీజేపీ

- Advertisement -


న్యూదిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన ‘చలో పార్లమెంట్’ ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో నిరసనలకు నాయకత్వం వహించిన వారితో కేంద్ర మంత్రి జేపీ నడ్డా సోమవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోశ్ కేంద్రం మంత్రికి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌ను వెంటనే విడుదల చేయడం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నీట్ లీక్ వల్ల ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. వీటిని సత్వరం అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే నిరసనలు కొనసాగిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తానని నడ్డా హామీ ఇచ్చారని భేటీ అనంతరం సీజేపీ ప్రతినిధులు ఎక్స్ వేదికగా తెలిపారు. నీట్, సహా వివిధ ప్రశ్న పత్రాల లీకేజీలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కారణమని సీజేపీ ఆరోపించింది. అయినా, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని, ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆక్షేపించింది.
మరోవైపు సీజేపీ ప్రతినిధులతో చర్చలు జరిపినట్లు కేంద్ర మంత్రి నడ్డా ఎక్స్లో పోస్టు చేశారు. స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరిగినట్లు చెప్పారు. ‘ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇవాళ ఉదయం ఆందోళనకారుల నుంచి తొలిసారి ప్రతిపాదన వచ్చింది. ఉదయం 11: 50 నిమిషాలకు మా చర్చలు ప్రారంభమయ్యాయి. తొలుత మౌఖికంగా చర్చలు జరిపాం. ఆ తర్వాత సాయంత్రం 4 గంటల సమయంలో లిఖిత పూర్వకంగా వినతిపత్రం సమర్పించారు’ అని నడ్డా ఎక్స్లో పేర్కొన్నారు. నిరసనకారులంతా ఆందోళన విరమించి, పరిస్థితులను సాధారణ స్థాయికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు