ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి.ఒకవైపు టెహ్రాన్‌లోని పలు ప్రాంతాలపై అమెరికా వరుస దాడులు కొనసాగిస్తుండగా,మరోవైపు గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు,కీలక మౌలిక సదుపాయాలనే లక్ష్యంగా చేసుకుని ఇరాన్ విప్లవ గార్డుల దళంప్రతిదాడులు కొనసాగిస్తోంది.
ఈ దాడుల్లో డేటా సెంటర్లను కూడా లక్ష్యంగా చేసుకోవడం గమనార్హంగా మారింది.సోమవారం రాత్రి జోర్డాన్‌లోని సైనిక,పౌర మౌలిక సదుపాయాలతో పాటు కువైట్,బహ్రెయిన్‌లలోని పౌర విమానాశ్రయాలు,విద్యుత్ కేంద్రాలపై ఇరాన్ దాడులు జరిపినట్లు సమాచారం.ఇదే సమయంలో బహ్రెయిన్‌లో ఉన్న అమెరికా దిగ్గజ సంస్థ అమెజాన్‌కు చెందిన డేటా సెంటర్‌పై డ్రోన్ దాడులు నిర్వహించినట్లు ఐఆర్‌జీసీ ప్రకటించింది.ఈ దాడుల్లో డేటా సెంటర్‌కు చెందిన కీలక మౌలిక వసతులు ధ్వంసమైనట్లు వెల్లడించింది.
జోర్డాన్‌లోని వైమానిక స్థావరంపై మూడు క్షిపణి దాడులు
జోర్డాన్‌లోని మువఫ్ఫాక్ సాల్టి వైమానిక స్థావరంపై 24 గంటల వ్యవధిలో మూడు క్షిపణి దాడులు జరిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు.సైనికులు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఈ దాడులు చోటుచేసుకోవడంతో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు.వైమానిక స్థావరానికి తీవ్ర నష్టం వాటిల్లగా, భారీ స్థాయిలో ఆస్తి నష్టం సంభవించినట్లు వెల్లడించారు.అలాగే తన తీరానికి సమీపంలో మోహరించిన అమెరికా నౌకాదళ ఆస్తులపై కూడా ఇరాన్ డ్రోన్లతో దాడులు నిర్వహించినట్లు సమాచారం.
మౌలిక సదుపాయాలే లక్ష్యం
ఇదిలా ఉండగా,ఇరాన్‌లోని రైల్వే స్టేషన్లు, విద్యుత్ కేంద్రాలు,టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు,ఇతర కీలక మౌలిక సదుపాయాలపై దాడులు చేపట్టినట్లు అమెరికా ప్రకటించింది.అలాగే ఇరాన్‌లోని ప్రధాన నౌకా కేంద్రం,అతిపెద్ద వాణిజ్య ఓడరేవు ఉన్న బందర్ అబ్బాస్ నగరంలోని పలు ప్రాంతాలపై కూడా క్షిపణి దాడులు చేసినట్లు తెలిపింది.ఈ దాడుల ప్రభావంతో ఆ ప్రాంతంలో రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.అదే సమయంలో బోంజీ ప్రాంతంలోని ఉప్పునీటి శుద్ధి కర్మాగారంపై జరిగిన దాడి కారణంగా దాదాపు 10 వేల మంది తాగునీటి సరఫరా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.మరోవైపు ప్రస్తుతం ఇరాన్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏకైక అణు విద్యుత్ కేంద్రం బుషెహర్‌కు కూడా అమెరికా దాడుల వల్ల గణనీయమైన నష్టం వాటిల్లినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.


