పి.పి.శాస్త్రి
నీట్ పేపర్ లీకేజీ ఒక వైపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నిరుద్యోగ యువతను ఉద్ధేశించి చేసిన వ్యాఖ్యలు మరో వైపు వెరసి జంతర్‌మంతర్ దగ్గర యువత ఆంతోళనలకు కారణమయ్యాయి. అదే సమయంలో ఒక యూట్యూబర్ అభిజిత్ అమెరికా నుంచి చేసిన వ్యంగ్య వీడియోలు అమాంతంగా వైరల్ అయ్యి, లక్షలాది మంది యువత తమ నిరసనను వ్యక్తం చేస్తూ, అతని ఫాలోయర్స్‌గా మారారు. ఆ తరువాత ఒకటొకటిగా జరిగిన పరిణామాలు కాక్రోచ్ జనతా పార్టీగా ఐదు డిమాండ్లు లేదా ఎజెండాలుగా ఏర్పడింది. వాటిల్లో ముఖ్యమైన, వెంటనే అమలు కావలసిన డిమాండ్లు రెండు మాత్రమే. ఒకటి నీట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించడం. రెండు గత పరీక్ష లీకేజీ వలన మనస్తాపానికి గురై మరణించిన వారి కుటుంబాలకు గౌరవ ప్రదమైన నష్టపరిహారం చెల్లించడం. వివాదాస్పద నీట్ పరీక్ష రద్దు అయ్యి, తిరిగి పరీక్ష నిర్వహించడం జరిగింది. నష్టపరిహారం విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం, రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం యువతను ఆందోళనకు గురిచేసింది. అది ఉద్యమంగా మారి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ యువత దిల్లీలో ప్రదర్శన, నిరసన ధర్నా చేపట్టారు.
దానిని సామరస్యంగా పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం, వారి వెనుక ఎవరున్నారు, దాని వలన తమ ప్రతిష్ట దెబ్బతింటుందా అనే మీమాంసతో ఆ ధర్నాలో పాల్గొన్న విద్యార్థి యువకుల మీద విచక్షణా రహితంగా లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించడం లాంటి పద్ధతులతో తన పంతం నెగ్గించుకునే ప్రయత్నం చేసింది. నిజానికి సీజేపీ ప్రధానంగా కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కినా, వారికి కావలసింది ఓదార్పు, క్షమాపణ, న్యాయం, అన్నిటికీ మించి కేంద్రం నుండి జవాబుదారీతనం. కేంద్ర ప్రభుత్వం కనుక కాస్త నిజాయితీగా వ్యవహరించి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాకుండా, సానుకూలంగా, సానుభూతితో వ్యవహరించి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు అనేది ఎవ్వరికైనా కనిపించే వాస్తవం. అయితే తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లుగా ప్రవర్తించే అలవాటు ఉన్న కేంద్ర ప్రభుత్వం, తమను ప్రజలు ఎన్నుకున్నారు కనుక, తమ ప్రభుత్వం ఎలా ఉండాలో, ప్రభుత్వంలో ఎవరు మంత్రులుగా ఉండాలో తమకే అధికారం ఉందని బీరాలు పలికారు. చివరకు కేంద్ర ప్రభుత్వం సీజేపీ నాయకత్వాన్ని చర్చలకు పిలిచింది. ఆ చర్చల సారాంశం ఎలా ఉన్నా, తదుపరి సీజేపీ ఏం చేస్తుంది, ఎటువంటి కార్యాచరణ, కార్యక్రమాలు చేపడుతుంది అనేదే ప్రశ్న. ఉవ్వెత్తున ఎగిసిన యువత కొన్ని రోజులు పరీక్షిస్తుంది. ఈ రోజు తరువాత సీజేపీ వారికి తదుపరి కార్యక్రమం ఏమీ లేదు. నిజానికి ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి అనే డిమాండు ఒక ఉద్యమ కార్యాచరణ కాదు, కాకూడదు. అది కేవలం ఉద్యమం బలపడడానికి ఒక నినాదం మాత్రమే. ఒకవేళ సదరు కేంద్ర మంత్రి రాజీనామా చేసేస్తే ఇంత ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమానికి తదుపరి డిమాండ్ ఇక ఉండదు. అతని రాజీనామా వలన సమస్య పరిష్కారం కూడా కాదు. వ్యవస్థలో ఉన్న లోపాలు, అవినీతి, ఒక మంత్రి రాజీనామాతో సమసిపోవు. వాస్తవానికి నిన్న దిల్లీలో జరిగిన సీజేపీ ప్రదర్శన, ధర్నా సమయంలో పోలీసుల అత్యుత్సాహం వలన వారి ఉద్యమం గురించి ప్రజలలో చర్చ జరుగుతోంది. అదే ప్రదర్శన, ధర్నా ఎటువంటి అడ్డంకులు, ఉద్రిక్తత లేకుండా జరిగి వుంటే దాని గురించి ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి ఉండేది కాదు. కేంద్రంలో ఉన్న అధికార పార్టీ అంచనా కూడా అదే అవడం వల్లనే ఇప్పుడు జరుగుతున్న పరిణామాల మీద వారి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. కనుక సీజేపీ పార్టీ నాయకత్వం నిర్మాణాత్మక నిర్ణయాలు, సిద్ధాంతపరమైన విధానాలు రూపొందించుకుని మలిదశ ఉద్యమాలకు బాటలు వేసుకోవాలి. లేని పక్షంలో ఇంత ఎత్తున ఎగసిన ఉద్యమం కూడా మరి కొన్ని రోజులలో ముగిసిపోతుంది.
ఏలూరు, సెల్ : 9885286643


