జులై 20న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చలో సంసద్’ పాదయాత్ర సందర్భంగా విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్యలకు సంబంధించిన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.నీట్-యూజీ పేపర్ లీక్, విద్యా వ్యవస్థలో అవకతవకలు, ఉపాధి సమస్యలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఈ నిరసనలో జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపు కదిలిన విద్యార్థులపై పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించడమే కాకుండా పెల్లెట్ గన్స్ కూడా ఉపయోగించారనే ఆరోపణలు ఉన్నాయి.
ఆందోళన జరుగుతోందన్న కారణంతో లాఠీచార్జ్ లేదా అధిక బలప్రయోగాన్ని సమర్థించలేం
ఈ పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్,జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి,జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం విచారించింది.శాంతియుతంగా, చట్టబద్ధంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని ధర్మాసనం స్పష్టం చేసింది.కేవలం ఆందోళన జరుగుతోందన్న కారణంతో లాఠీచార్జ్ లేదా అధిక బలప్రయోగాన్ని సమర్థించలేమని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.
“Right to Peaceful and Lawful Protest is Absolutely Guaranteed Under the Constitution” అంటూ సీజేఐ స్పష్టం చేశారు.పోలీసులు అధిక బలప్రయోగం చేశారనే ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని కోర్టు సూచించింది.ఈసమస్య కేవలం ఢిల్లీకే పరిమితం కాదని,దేశవ్యాప్తంగా నిరసనల నిర్వహణకు ఒకే విధమైన ప్రోటోకాల్ అవసరమని అభిప్రాయపడింది.
సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు
విద్యార్థులపై నమోదైన కేసులను కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఎత్తివేయాలి.
అరెస్టైన విద్యార్థులను తక్షణమే విడుదల చేయాలి.
నేర చరిత్ర లేని విద్యార్థుల విడుదలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
ఘటనలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను సుప్రీంకోర్టుకు సమర్పించాలి.


