Homeఅంతర్జాతీయంప్రపంచకప్‌ సమయంలో మెస్సీకి ముప్పు?.. బాంబులతో దాడికి ప్లాన్‌!

ప్రపంచకప్‌ సమయంలో మెస్సీకి ముప్పు?.. బాంబులతో దాడికి ప్లాన్‌!

- Advertisement -

ఫుట్‌బాల్‌ స్టార్‌ ఆటగాడు, అర్జెంటీనా జట్టు సారథి లియోనెల్‌ మెస్సీని హత్య చేసేందుకు కుట్ర జరిగిందా? 2026 ఫిఫా ప్రపంచకప్‌ సందర్భంగా అతడిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడికి ప్రణాళిక రూపొందించారా? అనే అంశంపై అంతర్జాతీయ మీడియాలో సంచలన కథనాలు వెలువడుతున్నాయి.
మెస్సీని లక్ష్యంగా చేసుకుని ఉగ్రమూకలు దాడికి ప్రయత్నించాయని స్పానిష్‌ పత్రిక ఒకటి కథనం ప్రచురించింది. ఈ విషయానికి సంబంధించి అమెరికా పోలీసుల వద్ద పక్కా సమాచారం ఉందని అందులో పేర్కొంది. అయితే భద్రతా ముప్పులను ఎఫ్‌బీఐ, అంతర్జాతీయ పోలీసు సహకార విభాగం నేతృత్వంలోని భద్రతా నెట్‌వర్క్‌ సమర్థంగా ఎదుర్కొందని తెలిపింది.

మెస్సీని పేల్చేస్తా అంటూ పోస్టు?
మెస్సీని లక్ష్యంగా చేసుకుని ఓ అనుమానితుడు తన సోషల్‌ మీడియా ఖాతాలో బెదిరింపు పోస్టు చేసినట్లు సదరు స్పానిష్‌ పత్రిక పేర్కొంది. నేను నడుచుకుంటూ అట్లాంటా స్టేడియం వద్దకు వెళ్తా. నా శరీరానికి నాలుగు బాంబులు ఉంటాయి. వాటితో మెస్సీని పేల్చేస్తాఃః అంటూ అతడు పోస్టు చేసి.. అనంతరం దాన్ని తొలగించినట్లు సమాచారం. ఈ పోస్టు భద్రతా వర్గాల దృష్టికి రావడంతో అధికారులు ఉన్నతస్థాయిలో సమీక్ష నిర్వహించి కఠిన చర్యలు తీసుకున్నట్లు స్పానిష్‌ పత్రిక వెల్లడించింది.

డాలస్‌ ఎయిర్‌పోర్ట్‌కు ఫోన్‌కాల్‌..
డాలస్‌ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ఓ ఫోన్‌కాల్‌ను కూడా అమెరికా భద్రతా అధికారులు పరిశీలించినట్లు సమాచారం. ఆ కథనం ప్రకారం.. ఇంట్లో తయారు చేసిన బాంబులతో పాటు ఏఆర్‌-15 రైఫిల్‌ తీసుకుని స్టేడియానికి వెళ్తున్నట్లు ఓ అనుమానితుడు ఫోన్‌లో పేర్కొన్నాడు. మెస్సీ మాత్రమే కాకుండా ఇతర ఫుట్‌బాల్‌ క్రీడాకారులు, పోలీసు అధికారులను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు భద్రతా సిబ్బంది గుర్తించినట్లు సమాచారం.

రొనాల్డోకూ ముప్పు?
ఈ కుట్రకు సంబంధించిన లక్ష్యాల జాబితాలో మెస్సీతో పాటు పోర్చుగల్‌ స్టార్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో పేరు కూడా ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.అంతేకాకుండా పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ జట్టు ఎక్కడ బస చేస్తుందనే విషయంపై ఓ వ్యక్తి ఆరా తీసినట్లు జూన్‌ 14న ఫిఫా ఉద్యోగి ఒకరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో అప్పటి నుంచే భద్రతా సంస్థలు మరింత అప్రమత్తంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి అధికారికంగా అన్ని వివరాలు వెల్లడికాలేదు. అంతర్జాతీయ మీడియా కథనాల్లో వచ్చిన సమాచారంపై ఆధారపడి ఈ అంశాలు వెలుగులోకి వచ్చాయి. చివరికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 2026 ఫిఫా ప్రపంచకప్‌ ప్రశాంతంగా ముగియడంతో అభిమానులు, నిర్వాహకులు ఊపిరిపీల్చుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు