తాగునీటికి మాత్రమే నీటి విడుదల.. పంటలు సాగు చేస్తే రైతులకే నష్టం
విశాలాంధ్ర, ఉరవకొండ: హంద్రీ–నీవా, తుంగభద్ర కాలువలకు ప్రస్తుతం విడుదలవుతున్న నీటిని కేవలం తాగునీటి అవసరాలకే వినియోగించాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ నీటిని సాగునీటిగా భావించి పంటలు సాగు చేస్తే మధ్యలో నీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. శుక్రవారం ఉరవకొండలో తహసీల్దార్ అరుణ, ఎంపీడీవో రవి ప్రసాద్, వ్యవసాయ శాఖ ఏడీ సత్యనారాయణ, హంద్రీ–నీవా ఏఈ రాఘవేంద్ర విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో డ్యాముల్లో నీటి నిల్వలు తగ్గిపోయాయని, అందుబాటులో ఉన్న నీటిని ప్రధానంగా తాగునీటి అవసరాలకే వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.కాలువలకు నీరు వస్తోందనే ఆశతో రైతులు పంటలు సాగు చేస్తే, మధ్యలో నీటి సరఫరా నిలిచిపోతే పెట్టుబడులు, శ్రమ పూర్తిగా వృథా అయ్యే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా అధిక నీటి అవసరమున్న వరి వంటి పంటలను సాగు చేసి అప్పుల పాలుకావద్దని సూచించారు. కౌలు రైతులు సైతం నీటి లభ్యతపై స్పష్టత లేకుండా సాగు చేపట్టవద్దని హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా హెచ్చరిస్తున్నామని అధికారులు తెలిపారు. నీటి లభ్యతపై అధికారికంగా స్పష్టత వచ్చే వరకు పంటల సాగుకు దూరంగా ఉండి పెట్టుబడులను కాపాడుకోవాలని కోరారు.


