నాలుగేళ్ల లోపు చిన్నారులకు కొన్ని మందులపై కేంద్రం ఆంక్షలు
చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగేళ్ల లోపు చిన్నారులకు క్లోర్ఫెనిరమైన్ మలేట్, ఫినైల్ఫ్రైన్ హైడ్రోక్లోరైడ్‌తో కూడిన ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్డీసీ) ఔషధాల వాడకంపై కేంద్రం ఆంక్షలు విధించింది. ఈ ఔషధాల తయారీ, విక్రయాలు, పంపిణీని పరిమితం చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
సాధారణంగా జలుబు, దగ్గు, అలర్జీ వంటి సమస్యల నివారణకు వాడే ఔషధాలలో ఈ కాంబినేషన్‌ను వినియోగిస్తారు. ఇకపై ఈ మందుల లేబుల్స్, ప్యాకేజీలపై “ఈ ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్‌ను నాలుగేళ్ల లోపు పిల్లలకు ఇవ్వరాదు” అనే హెచ్చరికను తప్పనిసరిగా ముద్రించాలని ఔషధ తయారీ సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది. నిపుణుల కమిటీ, డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ (డీటీఏబీ) చేసిన సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
గతంలో 2025 ఏప్రిల్ 15న ఈ సమ్మేళనాలు కలిగిన కొన్ని ఎఫ్డీసీ మందులపై మాత్రమే ప్రభుత్వం ఇలాంటి ఆంక్షలు విధించగా, తాజా ఉత్తర్వుల ద్వారా ఈ నిబంధనను అన్ని రకాల ఫార్ములేషన్లకు వర్తింపజేసింది. నాలుగేళ్ల లోపు చిన్నారులపై ఈ మందులు ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని, వీటికి బదులుగా సురక్షితమైన ప్రత్యామ్నాయ ఔషధాలు అందుబాటులో ఉన్నాయని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్-1940లోని సెక్షన్ 26ఏ కింద కేంద్ర ప్రభుత్వం ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.


