భారత దేశవాళీ క్రికెట్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత మోగిస్తున్నాడు. తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ఇప్పటికే పలుమార్లు వార్తల్లో నిలిచిన ఈ కుర్రాడు, తాజాగా మరోసారి చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. బెంగళూరు వేదికగా సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 సెమీఫైనల్ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ తరఫున ఆడుతూ అరుదైన ఘనత సాధించాడు. కేవలం 15 ఏళ్ల 175 రోజుల వయసులో హాఫ్ సెంచరీ చేసి, 57 ఏళ్ల సుదీర్ఘ రికార్డును బద్దలుకొట్టాడు.
ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్, ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. కేవలం 42 బంతుల్లోనే సిక్సర్ బాది తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. తద్వారా దులీప్ ట్రోఫీ చరిత్రలో అత్యంత పిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు 1969లో లక్ష్మణ్ సింగ్ పేరిట ఉండేది. అప్పుడు ఆయన 16 ఏళ్ల 23 రోజుల వయసులో ఈ ఘనత సాధించారు. ఇప్పుడు వైభవ్ ఆ రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో పియూష్ చావ్లా (16 ఏళ్ల 307 రోజులు) మూడో స్థానంలో ఉన్నాడు.
బ్యాటింగే కాదు, కెప్టెన్సీ కూడా..
ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో వైభవ్ తన నాయకత్వ పటిమను కూడా ప్రదర్శించాడు. ఈస్ట్ జోన్ రెగ్యులర్ కెప్టెన్ ఇషాన్ కిషన్ కుడి చేతి మణికట్టుకు గాయం కావడంతో మైదానం వీడాల్సి వచ్చింది. ఆ సమయంలో సుమారు గంటపాటు వైభవ్ జట్టుకు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు.
ఆల్‌రౌండ్ నైపుణ్యం
క్వార్టర్‌ఫైనల్‌లో నార్త్ ఈస్ట్ జోన్‌పై బ్యాటింగ్‌లో విఫలమైనప్పటికీ, వైభవ్ తన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో కేవలం మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 11 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. తన బౌలింగ్ గురించి బీసీసీఐ పంచుకున్న వీడియోలో వైభవ్ మాట్లాడుతూ.. “ఏ బ్యాటర్‌ను అడిగినా బౌలింగ్ చేయడం కూడా ఆస్వాదిస్తారు. వికెట్లు పడని సమయంలో ఇషాన్ భయ్యా నన్ను 2-3 ఓవర్లు వేయమన్నారు. నాతో బౌలింగ్ చేయించడం కొంత రిస్క్ అని భావించారు, కానీ నేను వికెట్లు తీయగలనని అతనికి తెలియదు” అని నవ్వుతూ చెప్పాడు.
“నాకు తక్కువ ఓవర్లే దొరుకుతాయని తెలుసు. అందుకే నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి, ఒకే స్పాట్‌లో బంతులు వేయడానికి ప్రయత్నించాను” అని తన ఆలోచనా విధానాన్ని వివరించాడు. మొత్తంగా బ్యాటింగ్, బౌలింగ్, కెప్టెన్సీతో వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్‌లో భవిష్యత్ తారగా ఎదుగుతున్నాడు.


