Homeతొలి దశ ఉద్యమ కార్యాచరణ ప్రారంభం

తొలి దశ ఉద్యమ కార్యాచరణ ప్రారంభం

- Advertisement -
  • కలెక్టర్లకు ఏపీ జేఏసీ అమరావతి నేతల నోటీసులు
  • 1 నుంచి 5 వరకు నల్లబ్యాడ్జీలతో విధులు
  • 3, 5 తేదీల్లో కలెక్టరేట్/ఆర్‌డీఓ కార్యాలయాల వద్ద నిరసనలు
  • 15 నుంచి వర్క్ టు రూల్

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తలపెట్టిన ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ ప్రకటించిన మొదటి దశ ఉద్యమ కార్యాచరణ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జిల్లా చైర్మన్లు, చైర్ పర్సన్లు, జిల్లా ప్రధాన కార్యదర్శుల అధ్వర్యంలో జిల్లా కలెక్టర్లకు ఉద్యమ కార్యాచరణ నోటీసులను సోమవారం అందజేశారు. ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ షెడ్యూల్‌ను కలెక్టర్లకు అందజేసి, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాల్సిన అవసరాన్ని వివరించారు. సెప్టెంబర్ 15 నుంచి వర్క్ టు రూల్ చేపట్టనున్న విషయాన్ని కలెక్టర్లకు స్పష్టంగా తెలియజేశారు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు, అసోషియేట్ చైర్మన్ టీవీ ఫణిపేర్రాజు, కోశాధికారి తిమ్మసర్తి నాగేశ్వరరావు పర్యవేక్షణలో సెప్టెంబర్ 1 నుంచి ఉద్యోగులంతా తమ తమ సెల్‌ఫోన్ వాట్సాప్ డీపీగా ‘సీఎం సార్… మా డబ్బులు మాకు ఇవ్వండి’ అనే నినాదాన్ని పెట్టుకుని ప్రభుత్వ దృష్టికి ఉద్యోగుల ఆవేదనను తీసుకెళ్లనున్నారు. 1 నుంచి 5వ తేదీ వరకు విధులకు హాజరయ్యే ఉద్యోగులందరూ నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన వ్యక్తం చేస్తారు. 3, 5వ తేదీల్లో అన్ని కలెక్టరేట్లు/ఆర్‌డీవో కార్యాలయాల వద్ద భోజన విరామం సమయంలో నిరసనలు వ్యక్తం చేస్తారు. ఉద్యోగుల బకాయిలు, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణమే నిర్ణయాలు తీసుకోవాలని నేతలు కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో దశలవారీగా ఉద్యమాన్ని కొనసాగిస్తా మని, ప్రభుత్వం స్పందించకపోతే ప్రకటించిన కార్యాచరణ ప్రకారం తదుపరి దశల్లో మరింత ఉధృతంగా ఉద్యమాన్ని చేపడతామని రాష్ట్ర నాయకులు స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు