Homeఆంధ్రప్రదేశ్ప్రజాసమస్యలపై సీపీఐ సమర భేరి

ప్రజాసమస్యలపై సీపీఐ సమర భేరి

- Advertisement -

. నేడు దిల్లీలో భారీ బహిరంగసభ
. డి.రాజా సహా జాతీయ నేతల హాజరు
. దేశం నలుమూలల నుంచి హస్తినకు పోటెత్తిన పార్టీ శ్రేణులు

న్యూఢిల్లీ: ‘బద్లావ్ జరూరీ హై’ (మార్పు తప్పనిసరి) నినాదంతో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) సెప్టెంబరు 1న న్యూఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్న జాతీయ స్థాయి భారీ బహిరంగసభకు దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇప్పటికే వేలాది మంది దేశ రాజధానికి చేరుకున్నారు. ఒడిశా, బీహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, పశ్చిమబెంగాల్, కేరళ , ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక నుంచి వేలాది మంది ఇప్పటికే రాజధానికి తరలి వచ్చారు. దేశవ్యాప్తంగా ర్యాలీకి లక్ష మందికి పైగా హాజరవుతారని సీపీఐ అంచనా వేస్తోంది. ర్యాలీకి వచ్చే వారికి వసతి కల్పించేందుకు రాంలీలా మైదానంలో ప్రత్యేకంగా టెంట్లు ఏర్పాటు చేశారు. కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు అక్కడే ఆర్గనైజింగ్ కమిటీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ర్యాలీలో పాల్గొనే వారి కోసం అంబేద్కర్ భవన్, బిర్లా మందిర్, వివిధ గురుద్వారాలు, గాంధీ పీస్ ఫౌండేషన్‌తో పాటు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు సమీపంలోని పహార్గంజ్‌లోని అనేక హోటళ్లలోనూ వసతి ఏర్పాట్లు చేశారు. రామ్ లీలా మైదానంలో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు.
ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం
రామ్ లీలా మైదాన్ లో మంగళవారం ఉదయం 9 గంటల నుండి బహిరంగ సభ ప్రారంభం కానుంది. తొలుత వివిధ రాష్ట్రాలకు చెందిన ఇప్టా, ప్రజా నాట్య మండలి కళాకారుల ప్రదర్శనలు, ఆ తర్వాత 10:30 గంటల నుండి ప్రధాన సభ ప్రారంభం కానుంది. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రధానోపన్యాసం చేయనున్నారు. అలాగే జాతీయ కార్యదర్శులు అమర్జిత్ కౌర్Y, రామకృష్ణ పాండా, కె.రామకృష్ణ, పి.సంతోశ్ కుమార్, పల్లా వెంకట్ రెడ్డి, ప్రకాశ్బాబు, గిరీశ్కుమార్ శర్మ, బీసీ కాంగో ఒక్కొక్కరు ఒక్కో అంశంపై ప్రసంగించనున్నారు. అలాగే పార్టీ విద్యార్థి యువజన విభాగాలకు చెందిన నాయకులు కూడా ఆయా రంగాల అంశాలపై ప్రసంగిస్తారు. కేంద్రంలోని 12ఏళ్ల మోదీ సర్కారు వైఫల్యాలతో పాటు దేశంలో నెలకొన్న రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేతలు ప్రస్తావించనున్నారు.
ధరల నియంత్రణ…యువతకు ఉపాధి
‘బద్లావ్ జరూరీ హై’ పేరుతో నిర్వహిస్తున్న ఈ ర్యాలీలో వివిధ కీలక అంశాలను సీపీఐ ప్రధానంగా ప్రస్తావించ నుంది. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని, యువతకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పించాలని పార్టీ డిమాండ్ చేయనుంది. అందరికీ ప్రభుత్వ వైద్యం, విద్య అందుబాటులో ఉండేలా హామీ ఇవ్వాలని కోరనుంది. మహిళా రిజర్వేషన్‌ను తక్షణమే అమలు చేయాలని, రైతులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ కల్పించాలని సీపీఐ డిమాండ్ చేయనుంది. కార్మికుల హక్కులను పరిరక్షించాలని, ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ల విధానాన్ని పునరుద్ధరించాలని కోరనుంది.
ప్రజాస్వామ్య పరిరక్షణకు పిలుపు
దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిం చడంతో పాటు దళితులు, గిరిజనులకు న్యాయం చేయాలని సీపీఐ డిమాండ్ చేస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న హింస, బలవంతంగా ఖాళీ చేయించే చర్యలను అరికట్టాలని కోరనుంది. ప్రజల హక్కులు, సామాజిక న్యాయం, ఉపాధి, విద్య, వైద్యం, రైతులు, కార్మికుల సమస్యలను ర్యాలీ ద్వారా జాతీయ స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలని పార్టీ భావిస్తోంది.
దేశవ్యాప్తంగా 20 వేల పాదయాత్రలు
ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం 12 ఏళ్ల వైఫల్యాలను ఎండ గ డుతూ, కేంద్రంలో ప్రభుత్వం మారి తీరాల్సిందేననే నినాదంతో సీపీఐ దేశ వ్యాప్తంగా ప్రచారోద్యమం నిర్వహించింది. ఆగస్టు 6 నుంచి 12వ తేదీ వరకు సుమారు 20 వేల పాదయాత్రలు చేపట్టారు. ఒక్క కేరళలోనే 1,500కు పైగా పాదయాత్రలు నిర్వహించారు. ఈ ప్రచారం ద్వారా పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం సహా విద్య వైద్యం సామాజిక న్యాయం కనీస మద్దతు ధర తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లింది. ఈ కార్యక్రమానికి ముగింపుగా సెప్టెంబర్ 1న దిల్లీలోని రామ్ లీలా మైదాన్ లో బద్లావ్ జరూర్ హై పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు