Homeవిశ్లేషణఏఐ యుగంలోనూ గురువే మార్గదర్శి

ఏఐ యుగంలోనూ గురువే మార్గదర్శి

- Advertisement -

డాక్టర్ ముసిని వెంకటేశ్వర్లు

విద్య కేవలం చదువు మాత్రమే కాదు, జ్ఞానం, నైపుణ్యాలు, విలువలు, ప్రవర్తనను పెంపొందించే ప్రక్రియ. ఇది వ్యక్తిగత జీవితాలను మెరుగు పరచడమే కాకుండా, సమాజాభివృద్ధికి, సంస్కృతిని తరతరాలకు అందించ డానికి, దేశ పురోగతికి తోడ్పడుతుంది. విద్యార్థులు తమ జీవితాలను సరైన మార్గంలో సమతుల్యం చేసుకోవడానికి సహాయపడే రెండవ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు. ఒక ఉపాధ్యాయుడు విద్యా జ్ఞానాన్ని మాత్రమే కాకుండా నైతిక విలువలను పెంచుతాడు. ఉపాధ్యాయ వృత్తిని ప్రపంచానికి తెలియ చేసిన ఘనత మన భారతీయులది. ఐతే విద్య పేదరికాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అందరికీ సమాన అవకాశాలను అందిస్తుంది. మెరుగైన సమాజాన్ని సృష్టిస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ఏ ప్రకారం 6`14 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను అందించాలి. విద్యను ప్రాథమిక హక్కుగా మార్చాలి. విద్య అనేది ఒక క్రమబద్ధ ప్రక్రియ, దీని ద్వారా పిల్లలు జ్ఞానవంతులవడానికి తొలి అడుగు పడుతుంది. ఇది ఒక వ్యక్తిని నాగరికంగా, సంస్కారవంతంగా, విద్యావంతుడిగా మారుస్తుంది. మనిషి మనుగడకు కూడు, గూడు ముఖ్యమైనవి… వీటిల్లో ఏది లేకపోయినా బతకడం కష్టం, పని చేస్తే గాని ఇల్లు నడవని పరిస్థితిల్లో ఉన్నారు నేటి ప్రైవేటు ఉపాధ్యాయులు. జీవితంలో ఓడిపోవడం, మోసపోవడం, చెడి పోవడం, పడిపోవడం అంటూ ఏం ఉండవు నేర్చుకో వడం మాత్రమే ఉంటుంది. కరోనా దెబ్బకు ఉపాధ్యాయులు జీవితాలు దుర్భరంగా మారా యి. వీరంతా వివిధ రంగాలలో వేతన జీవులుగా, జీవన పోరాటం చేస్తు న్నారు. కూడు… గూడు… ఉంటే చాలు అనే స్థితికి చేరుకుని చిరుజీతాలతో బతుకు పోరాటం చేస్తున్నారు. జీవితం ఒక పాఠశాల. ఇక్కడ నేర్చుకోవడం ఉంటుంది. ఎంతో మంది విద్యార్థులను మేధావులుగా తీర్చి దిద్దిన ఉపా ధ్యాయులు ప్రస్తుత సమాజంలో బతుకు పోరాటం చేస్తున్నారు. దీనికి కారణం ఎవరు? సాంకేతికత విద్యారంగాన్ని మునుపెన్నడూ లేనంత వేగంగా మారుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్మార్ట్ క్లాస్రూమ్‌లు, ఆన్‌లైన్ కోర్సులు, డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌లు విద్యార్థులకు సమా చారాన్‌ని ఫింగర్ టిప్స్‌ మీదకు తీసుకొచ్చేశాయి. ఐనా కానీ ఒక ముఖ్యమైన ప్రశ్న మిగిలే ఉంది. సాంకేతికత ఎప్పుడైనా ఉపాధ్యాయుడి స్థానాన్ని భర్తీ చేయగలదా సమాధానం చాలా సులభం… సాంకేతికత ఉపాధ్యాయుడికి సహాయపడగలదు, కానీ ఉపాధ్యాయుడి స్థానాన్ని భర్తీ చేయలేదు. ఉపాధ్యాయ దినోత్సవం అనగానే గుర్తొచ్చే వ్యక్తి డా॥సర్వేపల్లి రాధకృష్ణన్. ఆయిన సుమారు 150 గ్రంథాలు రచించారు. 1888 సెప్టెంబర్ 5న మద్రాసు ప్రెసిడెన్సీలోని తిరుత్తుణిలో జన్మించారు. ప్రాథమిక విద్యను తిరువళ్లూరులో పాఠశాలలో, ఉన్నత విద్యను రేణిగుంటలో, మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి మద్రాసు యునివర్సిటీలో త్తవశాస్త్రంలో ఎంఏ పట్టా పొందారు. 1954లో భారతరత్నను అందుకొని రాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు ప్లేటో కలలుగన్న ఫిలాసఫర్ కింగ్ అనే ఊహ సాకారమైన ట్లుగా విద్యావేత్తలు కొనియాడారు. కానీ ఈ సందర్భంలో దేశవిదేశాల్లో వున్న తన శిష్యులు, శ్రేయోభిలాషులు ఆయన్ను కలసి అభినందించి సెప్టెంబరు 5న ఆయన పుట్టినరోజును ఘనంగా నిర్వహించడానికి అనుమతి కోరారు. ఆయన స్పందించి తన పుట్టినరోజును వ్యక్తిగత వేడుకగా కాకుండా ఉపాధ్యాయులందరినీ గౌరవించేలా ‘ఉపాధ్యాయ దినోత్సవం’గా జరపాలని సూచించారు. దాంతో నాటి నుండి నేటి వరకు 5న ఉపాధ్యాయ దినోత్స వంగా దేశవ్యాప్తంగా జరుపుకోవటం ప్రారంభమైంది. ఐతే రానురాను ఉపా ధ్యాయుడి పాత్ర మారుతూ వస్తోంది. ఇప్పుడు విద్యార్థులు ఎక్కడి నుంచైనా పాఠాలను నేర్చుకునే ఎన్నో సౌకర్యాలు వచ్చాయి. సాంకేతికత చదువును, నేర్చుకునే విధానాన్ని ఎంతో సరళతరం చేసేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో వీడియోలు, యానిమేషన్లు, ఇంటరాక్టివ్ సెషన్స్‌ ద్వారా విద్యార్థులు కష్టమైన విషయాలను అర్థం చేసుకునే అవకాశం వచ్చేసింది. ఇది ఉపాధ్యాయులకు పాఠాలను సిద్ధం చేస్తూ అభ్యసన లోపాలను గుర్తిస్తూ అదనపు అభ్యసన వనరులను అందించడానికి సహాయపడుతుంది. ఐతే ముఖ్యమైన అంశం ఏంటంటే సమాచారం అందుబాటులో ఉండటం అంటే మంచి విద్య ఉన్నట్లు కాదు. ఒక విద్యార్థికి సమాధానం ఎలా వెతకాలో తెలిసుండొచ్చు… కానీ ఏ సమాధానం సరైనదో, దాని ప్రాముఖ్యత ఏమిటో, దాన్ని ఎలా ఉపయోగిం చాలో అర్థం చేసుకోవడానికి ఉపాధ్యాయుడు విద్యార్థికి సహాయపడతాడు. డిజిటల్ విద్య, కృత్రిమ మేధ, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ విద్యార్థులు నేర్చుకునే విధానాన్ని మారుస్తున్నాయి. సాంకేతికత సమాచారాన్ని వేగంగా అందిస్తుంది అభ్యసనాన్ని మరింత ఇంటరాక్టివ్గా మారుస్తుంది కానీ, ఉపాధ్యాయుడికి, విద్యార్థికి మధ్య ఉండే మానవ సంబంధాన్ని సాంకేతికత భర్తీ చేయలేదు. కంప్యూటర్ ఒక సమాధానాన్ని అందించగలదు, కానీ ఒక విద్యార్థి ఎందుకు ఇబ్బంది పడుతున్నాడో ఉపాధ్యాయుడే అర్థం చేసుకోగలడు. డిజిటల్ పాఠం ఒక విషయాన్ని వివరించగలదు, కానీ ఉపాధ్యాయుడు పిల్లలలో తమపై తాము నమ్మకాన్ని కలిగించగలడు. అంటే సాంకేతికతతో పాటు ఉపాధ్యా యుడి సహకారం ఉంటే విద్యార్థులు మెరుగయ్యే అవకాశం ఉంటుంది. ఒక విజయవంతమైన విద్యా వ్యవస్థ కేవలం మార్కులు, పరీక్షలపైనే కాకుండా, బాధ్యతాయుతమైన, ఆత్మవిశ్వాసమున్న పౌరులను తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టాలి. విద్యాభివృద్ధి కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వం కలిసి పనిచేయాలి. తెలంగాణలో పట్టణ, గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని పిల్లలకు సేవలం దించే ప్రభుత్వ పాఠశాలల విస్తృత నెట్‌వర్క్ ఉంది. విభిన్న నేపథ్యాలకు చెందిన పిల్లలకు నేర్చుకునే అవకాశాన్ని కల్పించడంలో ప్రభుత్వ విద్య కీలక పాత్ర పోషిస్తుంది. పాఠశాల విద్య, స్కాలర్‌షిప్‌లు, అభ్యసన సామగ్రి, భోజనం, డిజిటల్ విద్యకు సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమాలు విద్యా ర్థులకు మద్దతునిస్తూ, కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తాయి. ఈ ప్రయ త్నాలకు ఉపాధ్యాయులే కేంద్రబిందువు. ప్రభుత్వ పథకం వనరులను అందించగలదు, కానీ ఆ వనరులను తరగతి గదికి తీసుకొచ్చి, వాటిని అర్థవంతమైన అభ్యసనంగా మార్చేది ఉపాధ్యాయులే. ఉపాధ్యాయులు విద్యా ర్థులకు మార్గనిర్దేశం చేసి వారి ప్రతిభను ప్రోత్సహించి వారిలో ఆత్మవిశ్వా సాన్ని పెంపొందిస్తారు. ఐతే ఇప్పుడు ఏఐ రోజురోజుకీ ఒక ముఖ్యమైన విద్యాసాధనంగా మారుతోంది. కానీ ఒక ఉపాధ్యాయుడికి విద్యార్థితో ఉండే సంబంధం ఏఐకి ఉండదు. ఏఐ నేర్చుకోవడంలో సహాయపడగలదు కాని ఉపాధ్యాయులు మాత్రమే విద్యార్థులు విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరి ష్కారం, కమ్యూనికేషన్ నైపుణ్యాలను అభివృద్ధి చేయ గలుగుతారు. బోధన అనేది విద్యార్థి వ్యక్తిత్వం, సామర్థ్యం, భవిష్యత్తును రూపొందించే చాలా గొప్ప వృత్తి అని అబ్దుల్ కలాం చెప్పినట్లుగా, మన స్సులను, సమాజాలను రూపొం దించడంలో వారి అంకితభావానికి వారిని గౌరవించాలి. ఉపాధ్యాయులు సమాజంలో బహుముఖ పాత్ర పోషిస్తారు, వ్యక్తులు, సమాజాలు, దేశ్ఙాó వృద్ధికి దోహదపడతారు. వారి ప్రభావం తరగతి గదికి మించి విస్తరించి, భవిష్యత్తును రూపొందిస్తుంది. భవిష్యత్తును రూపొం దించేవారిగా విద్యా వేత్తలను ఆ ఒక్క రోజే కాదు ప్రతీరోజూ గౌరవించు కోవాలి. ఇటీవలి సంవత్సరాలలో (కరోనా మహమ్మారి, డిజిటల్ మార్పు సమయంలో వంటివి) వారి కృషిని ఎంత అభినందించినా తక్కువే. నేడు, ఉపాధ్యాయులను కేవలం జ్ఞానం అందించే వారిగా మాత్రమే కాకుండా, మన భవిష్యత్తుకు కీలకమైన వాస్తుశిల్పులుగా కూడా చూస్తున్నాం. ఇటీవలి ప్రపంచ సవాళ్లను అధిగమించడానికి డిజిటల్ సాధనాలు, కొత్త బోధనా విధానాలను స్వీకరిస్తూ ఎన్ని కష్టాలు, వైఫల్యాలు, ఒత్తిళ్లు ఎదురైనా కుంగి పోకుండా తిరిగి నిలదొక్కుకునే మానసిక బలాన్ని ప్రదర్శిస్తున్నారు. వారు మనకు స్ఫూర్తినిస్తూ, మార్గనిర్దేశం చేస్తూ, సాధికారత కల్పిస్తూనే, ఈ ప్రత్యేక రోజున మాత్రమే కాకుండా నిరంతర గౌరవం, మద్దతు ఇస్తూ వారి అంకిత భావాన్ని గౌరవించుకోవాలి. 21వ శతాబ్దపు సంక్లిష్టతలను ఎదుర్కోవడానికి, అభ్యాస స్ఫూర్తిని రూపొందించినందుకు ధన్యవాదాలు. “మనమందరం మెరుగైన భవిష్యత్తును నిర్మించుకోవడానికి విద్య అనే బహుమతిని ఉపయోగించుకుందాం”.
హార్ట్ఫుల్నెస్ అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ డీమ్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్, సెల్ : 9989295635

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు