Homeసాహిత్యంచారిత్రక కవిబ్రహ్మ-దుర్భాక

చారిత్రక కవిబ్రహ్మ-దుర్భాక

- Advertisement -

‘రాణా ప్రతాప సింహ చరిత్ర గ్రంథాన్ని ఆంగ్లభాష నిష్ణాతులు కట్టమంచి రామలింగారెడ్డి వంటి వారే మిక్కిలి మెచ్చుకున్నారంటే, నా బోంట్ల లెక్క ఏమిటి ! ఈయన పేరు రాజశేఖరుడు. ‘ఈ పేరు పరమేశ్వరునిదే కానీ ప్రస్తుత గ్రంథ రచనా సందర్భంలో ఉన్న కొన్ని ఘట్టాలను బట్టి చూస్తే, ప్రతాప సింహునికి పర్యాయమేమో అని ప్రతి సహృదయానికి గోచరిస్తుంది’ అని నా నమ్మకం! కవులలో తన్మయత్వం కలవారు కొందరే ఉంటారు. ఆధునికులలో ఈ రాజశేఖర కవి ‘తన్మయత్వం కల కవి’ అని అతని రచనే వ్యాఖ్యానిస్తూ ఉంది” అని తిరుపతి వెంకట కవులలో ఒకరైన చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి మన్ననలను పొందిన దుర్భాక రాజశేఖర శతావధాని 1888 నవంబర్ 18వ తేదీన కడప జిల్లా జమ్మలమడుగు గ్రామంలో సుబ్బమ్మ, వెంకటరామయ్య దంపతులకు జన్మించారు.
1904-07 మధ్య కందాళ దాసాచార్యులు, జనమంచి శేషాద్రి శర్మల వద్ద సంస్కృతాంధ్రాలు, నాటక అలంకార శాస్త్రాలు అభ్యసించారు. 1907లో కడప ఉన్నతపాఠశాలలో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులయ్యారు. తర్వాత మద్రాసు క్రైస్తవ కళాశాలలో ఎఫ్ ఎ చదువుకు చేరారు. “నాయనా నా కడుపున పుట్టిన బిడ్డడవు…నవతాలి పలుకులకు మరగితివా?” అని తెలుగు తల్లి ఒకనాడు బుజ్జగించి చెప్పినట్లుగా రాజశేఖరుని మనసుకు తోచింది. అంతే! మధ్యలోనే ఇంగ్లీష్ చదువులు ఆపేసి పొద్దుటూరు వచ్చేశారు.
1908 నుండి పొద్దుటూరులోని జిల్లా మునసబు కోర్టులో గుమాస్తాగా చేరి సుమారు 13 సంవత్సరాలు ఆ ఉద్యోగం చేశారు. ఒక వంక ఉద్యోగం చేస్తున్నా, కవిత్వం చెప్పటం మానలేదు.
చరిత్రను కథా వస్తువుగా చేసుకొని, దేశభక్తిని రేకెత్తించే మహాకావ్యాలు లేని కాలంలో, దేశభక్తిని ప్రబోధిస్తూ దుర్భాక రాజశేఖర శతావధాని మొట్టమొదటగా, రాణాప్రతాప సింహుని చరిత్రను మహాకావ్యంగా మలచారు.
ఈ రాణాప్రతాప సింహ చరిత్రను గురించి చెబుతూ, ‘ప్రపంచ విఖ్యాతుడైన అక్బర్ బాదుషాతో 25 వత్సరములు సంగరము చేసి, భారత స్వాతంత్ర్య పతాక నెగురువైచిన విశ్వవీర చూడామణి మహారాణా ప్రతాప సింహుడు! అట్టి ధరˆవీరుని చరిత్రాంశములు కొన్ని ఏళ్లుగా ఊహించి, భావించి, ధ్యానించి, తన్మయులై రాజశేఖర కవి కవితలో జొనిపి అతని అజరామరుని గావించిరి. పద్య చరిత్ర గ్రంథములకు ఈ ప్రతాప సింహ చరిత్ర ఒక వరవడి దిద్దెననుట సత్యమగు మాట! తెలుగులో పురాణ యుగము, వెంట ప్రబంధ యుగము, దానివెంట కావ్యయుగము, అనువాద యుగము వచ్చినవి. ఈ నవీన శకమున ఎన్నో మార్పులు వెలసినవి. నేడు పురాణముల మీద కంటే చరిత్రకృతులపై మక్కువ ఎక్కువగుచున్నది. భారతదేశం స్వాతంత్ర్యమునకు బహుథా పోరాడుతున్న కాలమున,’ ప్రతాప సింహాచరిత్ర ‘వంటి కృతులు వెలసి ఎంతో ఉపకరించినవి! ఇట్టి చరిత్ర కావ్యములకు రాజశేఖరునిది మార్గదర్శక స్థానము!” అంటూ దుర్భాక వారిని ఎంతో ప్రశంసించారు మహాకవి మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి.
గాంధీ స్వాతంత్రోద్యమ ప్రభావంతో 1921లో ఉద్యోగంవదిలి బయటకువచ్చేశారు దుర్భాకవారు. అవధానాలు నిర్వహించాలనే కోరికతో గడియారం వెంకట శేషశాస్త్రితో కలిసి, ‘రాజశేఖర వెంకట శేష కవులు’ అనే జంట పేరు పెట్టుకుని, 1920 నుంచి 1927 వరకు అనేక అవధానాలు విజయవంతంగా నిర్వహించారు. వీటిలో అష్టావధానాలు, ద్విగుణిత అష్టావ ధానాలు, శతావధానాలు కూడా ఉన్నాయి. కడపజిల్లా దాదిరెడ్డిపల్లె, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, నెమళ్ల దిన్నె, చెన్నూరు, కర్నూలుజిల్లా లోని ఉయ్యాలవాడ, అనంతపురం జిల్లాలోని గుత్తితో పాటుగా నెల్లూరులో కూడా వీరు అవధానాలు చేశారు.
శరన్నవరాత్రి పద్యాలు, వీరమతి అనే కావ్యాలు వీరు ఇరువురు జంటగా రచించారు. సువర్ణ కంకణాది ఘన సన్మానాలను అందుకున్నారు. ఈ అవగాహన జైత్రయాత్ర విశేషాలను స్పష్టపరిచే గ్రంథమే ‘అవధానసారం’. తరువాత వీరి జంట స్నేహం విడిపోయి, తరువాత ఎవరికివారుగా ఎన్నో అద్భుతమైన కావ్యాలు వెలయించారు. దుర్భాకవారు ప్రొద్దుటూరు మున్సిపల్ సంఘ సభ్యులుగా చాలా సంవత్సరాలు పనిచేసి, 1928లో ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. అంతేకాక 1927-32 మధ్య ప్రొద్దుటూరు తాలూకా బోర్డు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. మద్రాసు సెనేట్ సభ్యుడిగా, వేద పాఠశాల కార్యదర్శిగా సేవలను అందించారు.
వీరు స్వతంత్రంగా వీరమతి చరిత్రము, చండన్రుపాల చరిత్రము, పుష్పావతి, సీతా కళ్యాణము, సీతాపహరణం, వృద్ధి మూల సంవాదము, పద్మావతి పరిణయము, విలయ మాధుర్యము, స్వయంవరం, అనఘడు, గోదానము, శరన్నవరాత్రులు వంటి రచనలతో పాటు రాణి సంయుక్త అనే హరికథను, కామేశ్వరి స్తోత్రమాల అనే సంస్కృత కావ్యాన్ని కూడా రచించారు. వీరు ఆంగ్ల భాషలో కూడా రచనలు చేశారు.
కవి సార్వభౌమ, మహాకవి చూడమణి, అభినవ తిక్కన, చారిత్రక కవిబ్రహ్మ, సుకవి రాజరాజ, కవితా సరస్వతి, చారిత్రక కవి బ్రహ్మ, వీర రస రత్నాకర, మహాకవి మార్తాండ మొదలైన అనేక బిరుదులు అందుకున్నారు.
దేశభక్తిని ప్రబోధిస్తూ తన సాహిత్యంతో ప్రజా చైతన్యం కోసం కృషి చేసిన మహానుభావుడు దుర్భాక రాజశేఖర శతావధాని 1957 ఏప్రిల్ 30వ తేదీన స్వర్గస్తులయ్యారు.
సెల్: 94403 18415

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు