తెలంగాణలో రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారాయి. రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శనివారం (19వ తేదీ) నుంచి వర్షాల తీవ్రత పెరగనుందని తెలిపింది. గురు, శుక్రవారాల్లో కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఐఎండీ హెచ్చరికల ప్రకారం.. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్-మల్కాజిగిరి, ములుగు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. రాజధాని హైదరాబాద్‌లో ఆదివారం వరకు ఈదురుగాలులు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని అధికారులు తెలిపారు. వాతావరణ నిపుణుడు టి.బాలాజీ సైతం తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా సెప్టెంబర్ 17, 18 తేదీల్లో రాత్రి, తెల్లవారుజామున తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేశారు. నగరంలో రాత్రిపూట మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నైరుతి రుతుపవనాల సీజన్లో రాష్ట్రంలో వర్షపాతం లోటు కొనసాగుతోంది. ఇప్పటివరకు తెలంగాణలో సాధారణంగా 664.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 536.5 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. ఇది 19 శాతం లోటును సూచిస్తోంది. ముఖ్యంగా హనుమకొండ జిల్లాలో అత్యధికంగా 42 శాతం వర్షపాతం తక్కువగా నమోదైంది. హైదరాబాద్‌లోనూ సాధారణ వర్షపాతం 550.8 మి.మీ. కాగా, ఇప్పటికి 432 మి.మీ. మాత్రమే కురిసింది. రానున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.


