విద్యుత్ ఏడి కార్యాలయం ముట్టడి
తొమ్మిది గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : పంటలను కాపాడుకునేందుకు రైతులకు వ్యవసాయ విద్యుత్‌ను తొమ్మిది గంటలపాటు నిరంతరాయంగా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ చీకలగురికి, ఉండబండ గ్రామాలకు చెందిన రైతులు గురువారం ఉరవకొండ విద్యుత్ శాఖ ఏడి కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కార్యాలయం ముందు బైఠాయించి విద్యుత్ శాఖ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడి గంటల తరబడి విద్యుత్ నిలిచిపోతుండటంతో పంటలకు సకాలంలో నీరు అందించలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మిర్చి తదితర పంటలు నీరందక ఎండిపోయే పరిస్థితి నెలకొందని తెలిపారు. వందలాది ఎకరాల్లో లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు కళ్లముందే దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ సిబ్బంది గ్రామాల్లో పర్యటించి సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ఆరోపించారు. అనంతరం విద్యుత్ శాఖ ఏడి, ఏఈ రైతుల ఆందోళన వద్దకు వచ్చి వారితో మాట్లాడారు. విద్యుత్ సరఫరాలో కొంత అంతరాయం ఉన్నట్లు తెలిపారు. సమస్యను అధిగమించి పంటలను కాపాడుకునేలా విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.


