విద్యార్థులకు అవగాహన కల్పించిన అధికారులు
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గురువారం ఉరవకొండ గ్రామంలో స్వచ్ఛతే సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఇందిరానగర్‌లోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు పరిశుభ్రత, పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. అనంతరం సెంట్రల్ పాఠశాల విద్యార్థులను చెత్త నుంచి సంపద తయారీ కేంద్రానికి తీసుకెళ్లి తడి, పొడి చెత్తను ఇంటి వద్దనే వేరు చేసి పారిశుధ్య సిబ్బందికి అందించాల్సిన విధానాన్ని వివరించారు. తడి చెత్తను సక్రమంగా వినియోగించడం ద్వారా సేంద్రియ ఎరువు తయారు చేసుకోవచ్చని తెలిపారు. కేంద్రంలో తయారవుతున్న వర్మీ కంపోస్టు ఎరువును విద్యార్థులకు చూపించి, ఇంటి వద్ద తడి చెత్తతోనే కంపోస్టు ఎరువు తయారు చేసుకునే విధానాన్ని ప్రదర్శన ద్వారా వివరించారు. చెత్తను విచ్చలవిడిగా పడేయకుండా వేరు చేసి ఇవ్వడం ద్వారా గ్రామ పరిశుభ్రతతో పాటు పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని సూచించారు.
అనంతరం ఇందిరానగర్ పాఠశాలలో విద్యార్థులు, సిబ్బందితో స్వచ్ఛతే సేవ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, స్వచ్ఛభారత్ మండల సమన్వయకర్త ఎం.జయప్రకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


