నల్లకాలువ వద్ద రోడ్డుకు అడ్డంగా కూలిన చెట్టు – తప్పిన ప్రమాదం
విశాలాంధ్ర – అనపర్తి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో అనపర్తి నియోజకవర్గంలో రాత్రంతా విస్తారంగా వర్షాలు కురిశాయి. బుధవారం రాత్రి నుంచి గురువారంతెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈదురు గాలులతో కూడిన వర్షానికి అనపర్తి మండలం నల్లకాలువ సమీపంలో భారీ వృక్షం నేలకూలింది.భారీ చెట్టు ఒక్కసారిగా రోడ్డుకు అడ్డంగా కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పక్కనే ఉన్న ద్విచక్ర వాహనం స్వల్ప తేడాతో తప్పించుకుంది.
విషయం తెలుసుకున్న స్థానికులు, అధికారులు వెంటనే స్పందించి జేసీబీ సహాయంతో చెట్టును తొలగించి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ అనిల్ కుమార్ సూచించారు.


