విశాలాంధ్ర,ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ గ్రామీణ నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన ఈరన్నను శుక్రవారం పలువురు జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు కలిసి అభినందనలు తెలిపారు. జర్నలిస్ట్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు మాలపాటి శ్రీనివాసులు, జిల్లా సహాయ కార్యదర్శి మీనుగ మధుబాబు, డి.బాలచంద్ర నాయుడు సీఐను కలిసి పూలమాలతో సత్కరించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. టీడీపీ నాయకులు నెట్యం రాంబాబు, ఓబులేసు తదితరులు సీఐకు పూలబొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మార్పీఎస్, ఇతర ప్రజాసంఘాల నాయకులు సైతం సీఐను కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా సీఐ ఈరన్న మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో చట్టం, న్యాయం అందరికీ సమానంగా అందేలా కృషి చేస్తానన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజా సమస్యలపై తక్షణమే స్పందిస్తానని తెలిపారు.


