మంత్రి పయ్యావుల కేశవ్
విశాలాంధ్ర అనంతపురం టౌన్ : శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. శనివారం జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నందు నిర్వహించిన పాసింగ్ అవుట్ పెరేడ్” ఎస్ సి టీ పి సి ఎస్ (సివిల్ ) బ్యాచ్ 2025-26 కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ…. పోలీస్ బాధ్యతలు చేపట్టే అభ్యర్థులు ఇప్పటివరకు విద్యావంతులుగా ఉండి నేటి నుంచి పోలీస్ సేవల్లోకి రావడం అభినందనీయమన్నారు. ఖాఖీ యూనిఫార్మ్ అధికారంతో పాటు బాధ్యతను ఇచ్చిందని శిక్షణార్ధులందరూ తమ విధులను బాధ్యతగా నిర్వర్తించాలన్నారు. పోలీసు బాస్ ఎవరు అంటే రోడ్డు మీద విధులు నిర్వహించే పోలీసు అని ప్రతిసారి గర్వంగా చెబుతుంటానన్నారు.
రోడ్డు మీద కనిపించే ప్రభుత్వ ప్రతినిధులు మీరేనని మీ ప్రవర్తన ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. అన్ని ఉద్యోగాలకు వేళలు ఉంటాయని పోలీసులకు నిరంతరం బాధ్యత మాత్రమే ఉంటుందన్నారు. ప్రమాదాలకు ఎదురు వెళ్లి విధులు నిర్వహించేవారు పోలీసులు…పోలీసులు రక్షణ కల్పిస్తూ కాపలా కాస్తున్నారు కాబట్టే మనం పండుగలు చేసుకుంటూ హాయిగా నిద్రపోతున్నామన్నారు. ఎంతోమంది పోలీసులు త్యాగాలు చేయడం వల్ల నేడు సమాజం ప్రశాంతంగా ఉందన్నారు. పోలీసులను చూసి రౌడీలు భయపడాలని ప్రజలు ప్రతి యూనిఫార్మ్ వెనుక ఓ మంచి పోలీసు ఉన్నాడన్నది గుర్తించే విధంగా పోలీసులు సమాజానికి బాధ్యతగా సేవ చేయాలన్నారు. ప్రస్తుత సమాజంలో టెక్నాలజీ పెరిగిపోతుందని ప్రతి ఒక్కరు టెక్నాలజీని సద్వినియోగం చేసుకొని నేరస్తులు మిమ్మల్ని చూసి భయపడేలా పనిచేయాలన్నారు. పోలీస్ లు నిరంతరం అప్డేట్ అవుతూ మానవత్వంతో బాధ్యతతో పనిచేసి మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకురావడానికి కష్టపడిన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. యూనిఫార్మ్ ఓ నమ్మకం, బాధ్యత ను కల్పిస్తుంది బాధితులకు నమ్మకం కల్పించే విధంగా మన ప్రాంతానికి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. రాష్ట్రంలో అతి పెద్ద బ్యాచ్ అనంతపురం నుంచి పాసింగ్ ఔట్ జరగడం తమకెంతో గర్వంగా ఉందన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ మాట్లాడుతూ….
తొమ్మిది నెలల పాటు శిక్షణను పూర్తి చేసుకుని విధుల్లోకి ప్రవేశిస్తున్న పోలీసులకు అభినందనలు తెలిపారు. నేటి నుంచి శిక్షణార్ధులకు బాధ్యతలు ఉంటాయని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను దృష్టిలో ఉంచుకొని విధులు నిర్వహించాలన్నారు. పోలీసులుగా ఎంపికైన వారందరూ క్రమశిక్షణతో ఉన్నతాధికారుల సూచనలు సలహాలు పాటిస్తూ మీకు మీ కుటుంబానికి సమాజానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జగదీష్ ,పిటిసి ప్రిన్సిపల్ సుప్రజ, ట్రైనింగ్ ఆర్‌ఐలు, ట్రైనింగ్ ఆర్‌ఎస్‌ఐలు, ఇన్‌స్పెక్టర్లు, ఇతర అధికారులు, వీఐపీలు, పోలీసు అధికారులు మరియు సిబ్బంది, శిక్షణార్థుల కుటుంబ సభ్యులు, అసోసియేషన్ ప్రెసిడెంట్ తలారి పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు.


