ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ న్యాయపరమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తే అక్రమ అరెస్టులు, లాఠీచార్జీలతో వేధించడం అమానుషమని ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి అన్నారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళా ఉద్యోగులను రోడ్డుపై ఈడ్చుకెళ్లడం దుర్మార్గమని, అరెస్టు చేసిన ఉద్యోగులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సచివాలయ వ్యవస్థను కుదించి ఉద్యోగులపై మరింత పని భారం మోపడం సరికాదన్నారు.
15,004 సచివాలయాలను 7,715కు కుదించే నిర్ణయాన్ని ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు.సర్వేలు, వివిధ ప్రభుత్వ కార్యక్రమాల పేరుతో ఉద్యోగులపై అధిక పనిభారం పెడుతున్నారని విమర్శించారు. ఉద్యోగులకు శాఖల వారీగా పదోన్నతులు కల్పించకుండా సూపర్‌న్యూమరీ పోస్టుల పేరుతో ఉత్తర్వులు జారీ చేయడం సరికాదన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు భేషరతుగా పదోన్నతులు, నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ ఎల్లప్పుడూ వారి పక్షాన పోరాడుతుందని శివరామిరెడ్డి తెలిపారు.


