దిల్లీలోని బేలా ఎస్టేట్‌లో ఓటరు జాబితా నుంచి 727 మంది ఓటర్ల పేర్లను తొలగించడంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై విమర్శలు చేశారు.లీగల్ ఓటర్లను జాబితా నుంచి తొలగించడం మరో ఓట్ చోరీ అంటూ ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్‌లో ఓ వీడియోను పోస్టు చేశారు.ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పదవి నుంచి వెళ్లిపోయినా.. ఆయన ద్వారా ఓట్లను తొలగించిన వ్యవస్థ మాత్రం సమాధానం చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు.యమునా నది ఒడ్డున ఉన్న బేలా ఎస్టేట్‌లో మొత్తం 728 మంది నివసిస్తున్నారని రాహుల్ తెలిపారు.ఎస్‌ఐఆర్ ప్రక్రియ అనంతరం ఓటరు జాబితాలో ఒక్కరి పేరు మాత్రమే మిగిలిందని చెప్పారు.
ఇది ఎస్‌ఐఆర్ ప్రక్రియ కాదు
అంటే 727 మంది ఓటర్ల పేర్లు తొలగించినట్లేనని పేర్కొన్నారు.వీరంతా కొన్ని దశాబ్దాలుగా అక్కడే నివసిస్తున్నారని, 2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటు వేశారని వివరించారు.2023లో వారి ఇళ్లను కూల్చివేసినా.. వారు అక్కడి నుంచి ఎక్కడికీ వెళ్లలేదని రాహుల్ అన్నారు.ఇళ్లు కూల్చివేశారనే కారణంతో ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లను తొలగించినట్లు అధికారులు చెబుతున్నారని తెలిపారు.ఒక వ్యక్తి నివసించే ఇంటికి, అతడి ఓటుహక్కుకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఇది ఎస్‌ఐఆర్ ప్రక్రియ కాదని, ఓట్ల చోరీ అని రాహుల్ వ్యాఖ్యానించారు.
ఉన్న ఒక్క అవకాశాన్నీ దొంగిలిస్తున్నారు: రాహుల్
ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు అత్యంత కీలకమైనదని రాహుల్ గాంధీ అన్నారు.సామాన్యుల చేతిలో ఉండే ఏకైక ఆయుధం ఓటుహక్కేనని పేర్కొన్నారు.ఇప్పుడు ఆ హక్కును కూడా ఎస్‌ఐఆర్ పేరుతో దొంగిలిస్తున్నారని ఆయన విమర్శించారు.ఓటర్ల జాబితా పునర్విమర్శ, కొత్త ఓటర్ల నమోదుపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారంటూ ఓ ఆంగ్ల పత్రికలో కథనం వెలువడినప్పటి నుంచి రాహుల్ గాంధీ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై విమర్శలు చేస్తున్నారు.
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌ఓలు) ఇంటింటి సర్వే నిర్వహించారని అధికారులు తెలిపారు.ఓటర్ల ఇళ్లను కూల్చివేయడంతో ప్రస్తుతం వారు అక్కడ నివసించడం లేదని గుర్తించినట్లు చెప్పారు.ఈ కారణంగానే ప్రజాప్రాతినిధ్య చట్టం నిబంధనల ప్రకారం వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.


