Homeజాతీయందసరా వేళ పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు.. అటవీశాఖ హెచ్చరిక

దసరా వేళ పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు.. అటవీశాఖ హెచ్చరిక

- Advertisement -

దసరా పండుగ సందర్భంగా పాలపిట్టలను పట్టుకుని పంజరాల్లో బంధించడం, ప్రదర్శించడం వంటి చర్యలను ఉపేక్షించేది లేదని, ఇలాంటి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అటవీ దళాల అధిపతి (హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్) వినయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు క్షేత్రస్థాయి అధికారులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. నిన్న‌ హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో అటవీ శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పాలపిట్టల సంరక్షణ, ప్రమాదకరమైన చైనా మాంజా నియంత్రణపై ఆయన సమీక్షించారు.ఈ సందర్భంగా వినయ్ కుమార్ మాట్లాడుతూ.. విజయదశమి రోజు పాలపిట్టను చూడటం శుభసూచకంగా భావించే సంప్రదాయం ఉందని, అయితే కొందరు ఇదే అదనుగా వాటిని పట్టుకుని పంజరాల్లో బంధించి ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఇలా చేయడం వల్ల పక్షులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతాయని, ఆహారం తీసుకోక బలహీనపడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది దసరా సమయంలో బంధించిన 28 పాలపిట్టలను స్వాధీనం చేసుకుని తిరిగి విడిచిపెట్టిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పాలపిట్టలను బంధించడం వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం నేరమని స్పష్టం చేశారు.

స్వేచ్ఛగా చూడటమే సంప్రదాయం
విజయదశమి రోజు పాలపిట్టను చూడాలనే నమ్మకం తరతరాలుగా కొనసాగుతోందని, తెలంగాణ సంస్కృతిలో దీనికి ప్రత్యేక స్థానం ఉందని అధికారులు తెలిపారు. అయితే, ఆ సంప్రదాయం ప్రకారం పాలపిట్టను దాని సహజ ఆవాసంలో స్వేచ్ఛగా ఎగురుతుండగా చూడాలి తప్ప, పంజరంలో బంధించి చూడటం కాదని వారు స్పష్టం చేశారు. దసరా ఉత్సవాలు జరిగే ప్రదేశాలు, ముఖ్యంగా ఆలయాల వద్ద పాలపిట్టలను పంజరాల్లో ఉంచి ప్రదర్శించకుండా పర్యవేక్షించాలని దేవాదాయ శాఖ అధికారులకు అటవీశాఖ సూచించింది. ఎక్కడైనా ఇలాంటి ఘటనలు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

చైనా మాంజాపైనా ఉక్కుపాదం
ఇదే సమావేశంలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో వినియోగించే ప్రమాదకరమైన చైనా మాంజాపైనా అధికారులు చర్చించారు. గాజు పొడి పూసిన ఈ మాంజా వల్ల పక్షులు తీవ్రంగా గాయపడి మరణిస్తున్నాయని, కొన్నిసార్లు మనుషులకు కూడా ప్రాణాపాయం కలిగిస్తోందని వినయ్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో చైనా మాంజా అమ్మకాలు, నిల్వలు, వినియోగాన్ని పూర్తిగా నిరోధించేందుకు సంబంధిత శాఖలతో కలిసి సమన్వయంతో పనిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు