తెలుగు రాష్ట్రాల్లో ‘వీఆర్కే డైట్’ సృష్టికర్తగా సుపరిచితులైన వీరమాచనేని రామకృష్ణపై సైబరాబాద్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఆయన ఇచ్చిన తప్పుడు వైద్య సలహా కారణంగా తన ప్రాణాల మీదకు వచ్చిందని ఓ లా విద్యార్థి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు.వివరాల్లోకి వెళ్తే, నిర్మల్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల కల్లెడ సాయికృష్ణ టైప్-1 డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. సోషల్ మీడియాలో వీరమాచనేని వీడియోలు చూసి, తన వ్యాధి నయమవుతుందని నమ్మి హైదరాబాద్‌లోని షేక్‌పేటలో ఉన్న వీఆర్కే హెల్త్ కేర్ సెంటర్‌ను సంప్రదించారు. అక్కడ వీరమాచనేని, ఆయన సహాయకుడు కోటేశ్వరరావు తనను ఇన్సులిన్ వాడకాన్ని ఆపేయాలని సూచించినట్లు సాయికృష్ణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకోసం వారు రూ. 26,000 ఫీజుగా వసూలు చేశారని తెలిపారు.వారి సలహా పాటించిన రెండు రోజులకే సాయికృష్ణ ఆరోగ్యం తీవ్రంగా విషమించింది. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించగా, డయాబెటిక్ కీటోఎసిడోసిస్‌తో పాటు తీవ్రమైన డీహైడ్రేషన్‌కు గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. తాను మోసపోయానని గ్రహించిన సాయికృష్ణ, వీరమాచనేని, కోటేశ్వరరావుపై రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చీటింగ్, ప్రాణాలకు హాని కలిగించడం, నేరపూరిత కుట్ర వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వీఆర్కే డైట్ సృష్టికర్త వీరమాచనేని రామకృష్ణపై క్రిమినల్ కేసు
- Advertisement -


