: విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కేవలం కమ్మ, క్రైస్తవ సామాజిక వర్గాలకే పరిమితమైందని, ఈ రెండు కుటుంబ పార్టీలకు ప్రత్యామ్నాయం అవసరమని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… టీడీపీ, వైసీపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర విభజన హామీలు నెరవేరకపోయినా ఈ రెండు పార్టీలు కేంద్రాన్ని ప్రశ్నించవని, కేవలం పదవుల కోసమే పనిచేస్తాయని ఆరోపించారు. చంద్రబాబు తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేయడానికి, జగన్ తన కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి తీసుకురావడానికే ప్రాధాన్యత ఇస్తారని సాయిరెడ్డి విమర్శించారు. గత 12 ఏళ్లలో రాష్ట్రానికి రూ.12 లక్షల కోట్ల అప్పు తప్ప ఒక్క కొత్త ప్రాజెక్టు గానీ, యువతకు ఉద్యోగాలు గానీ రాలేదని అన్నారు. ఒక పార్టీకి కుల పిచ్చి, మరో పార్టీకి మత పిచ్చి పట్టుకుందని దుయ్యబట్టారు. తాను పెట్టబోయే కొత్త పార్టీ అధికారంలోకి వచ్చినా తాను సీఎం కాబోనని, అన్ని కులాలకు సమాన అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. రాజధాని మార్పు అవివేకమని, అమరావతిని అన్ని కులాలు, మతాల రాజధానిగా అభివృద్ధి చేయాలని తాను కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. విశాఖను రాజధాని చేస్తామని చెప్పి మాట తప్పిన వైసీపీ… ఉత్తరాంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఃమావిగన్ః అంటూ జగన్ ఇప్పుడు యూటర్న్ తీసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. లిక్కర్ స్కామ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని, రాజ్ కెశిరెడ్డి వల్లే ఆ వ్యవహారం జరిగిందని విజయసాయి రెడ్డి తెలిపారు. సజ్జల రామకృష్ణారెడ్డి తనను జగన్ వద్ద విలన్‌గా చిత్రీకరించి పార్టీకి నష్టం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ అధికారంలోకి వచ్చాక కుట్రలతో తనను పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే కొత్త పార్టీ పేరును ప్రకటించి, ఆ తర్వాత పాదయాత్ర చేపడతానని ఆయన వెల్లడించారు.


