టీడీపీ శ్రేణులకు మంత్రి పయ్యావుల పిలుపు
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా టీడీపీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పిలుపునిచ్చారు. ఉరవకొండ మండలం కౌకుంట్లలో శనివారం నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. అవాస్తవాలను నమ్మకుండా ప్రజల్లో ఉంటూ పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. ప్రతి గ్రామానికి రహదారులు, హంద్రీనీవా కాలువ వెడల్పు పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రామస్థాయిలో ఇప్పటి నుంచే సమన్వయంతో పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. సమావేశంలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్‌రెడ్డి, ఎన్నికల పరిశీలకుడు ఏరాస్ ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.


