- యువతిపై కత్తితో దాడి.. అనంతరం యువకుడి ఆత్మహత్య
- చికిత్స పొందుతూ మహాలక్ష్మి మృతి
విశాలాంధ్ర -విజయవాడ (క్రైమ్): ప్రేమించిన యువతిని కత్తితో గాయపరిచి, అనంతరం యువకుడు అపార్ట్మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలో శనివారం చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన యువతి చికిత్స పొందుతూ మృతి చెందింది.
స్థానికుల సమాచారం మేరకు.. న్యూ రాజరాజేశ్వరి పేటకు చెందిన పడవల మహాలక్ష్మి (19), అదే ప్రాంతానికి చెందిన మోకు చిన్న (22) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వివాహం చేసుకోవాలని ఇరు కుటుంబాలకు విషయం చెప్పగా, యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో మహాలక్ష్మి అతడిని దూరంగా ఉంచుతున్నట్లు సమాచారం.
శనివారం ఉదయం మహాలక్ష్మి ఇంటికి వెళ్లిన చిన్న.. ఇంట్లో ఉన్న ఆమెపై కత్తితో మెడపై దాడి చేసాడు. తీవ్రంగా గాయపడిన మహాలక్ష్మిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
మరోవైపు, దాడి అనంతరం చిన్న న్యూ రాజరాజేశ్వరి పేటలోని జేఎన్ఎన్యూఆర్ఎం జీ+3 అపార్ట్మెంట్ పైకి వెళ్లి అక్కడి నుంచి దూకేసాడు. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన పై విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


