విశాలాంద్ర, భీమిలి (విశాఖపట్నం) : ఆనందపురం మండలం గంభీరం గ్రామ పంచాయతీలో సర్పంచి నామినేషన్ ఉపసంహరణ వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియలో చోటుచేసుకున్న పరిణామాలు గ్రామంలో రాజకీయ వేడిని పెంచాయి. వైకాపా తరఫున సర్పంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్న బోయ రమణ నామినేషన్ ఉపసంహరణకు సంబంధించి భిన్న వాదనలు తెరపైకి రావడంతో అసలేం జరిగిందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు తాను స్వచ్ఛందంగా నామినేషన్ ఉపసంహరించుకోలేదని అభ్యర్థి చెబుతుండగా, మరోవైపు ఆయన నామినేషన్ ఉపసంహరించుకున్నారని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.
గంభీరం పంచాయతీలో బోయ రమణ నామినేషన్ ఉపసంహరణకు సంబంధించిన పత్రం విషయంలోనే ప్రధాన వివాదం నెలకొంది. రిటర్నింగ్ అధికారి వద్ద ఉన్న ఉపసంహరణ దరఖాస్తును టీడీపీ అభ్యర్థి తీసుకెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కీలకమైన పత్రం అధికారి వద్ద నుంచి బయటకు ఎలా వెళ్లింది? ఎవరి సమక్షంలో ఆ పత్రాన్ని తీసుకెళ్లారు? అభ్యర్థి సమ్మతి లేకుండానే ఈ వ్యవహారం జరిగిందా? అన్న ప్రశ్నలు స్థానికంగా చర్చకు దారితీశాయి. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.
ఈ వ్యవహారంపై బోయ రమణ తన వాదనను వెల్లడించినట్లు తెలిసింది. తాను రెండు నామినేషన్ పత్రాలు దాఖలు చేశానని, వాటిలో ఒక పత్రంపై సంతకం చేయాలని అడగడంతో సంతకం చేశానని, అయితే అది నామినేషన్ ఉపసంహరణకు సంబంధించిన దరఖాస్తు అని తనకు తెలియదని పేర్కొన్నట్లు సమాచారం. తాను స్వచ్ఛందంగా ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోలేదన్నది ఆయన వాదనగా తెలుస్తోంది. దీంతో అసలు ఏ పత్రంపై సంతకం తీసుకున్నారు? దాని వివరాలను అభ్యర్థికి తెలియజేశారా? ఉపసంహరణ దరఖాస్తుపై సంతకం చేసే సమయంలో రిటర్నింగ్ అధికారి సమక్షంలో ఉన్నారా? అన్న అంశాలు వరకు స్పష్టత ఏదీ లేదు.
నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియకు సంబంధించి వివాదం తలెత్తినప్పటికీ రాత్రి 7.30 గంటల వరకు ఎన్నికల అధికారి నుంచి పూర్తిస్థాయి వివరణ వెలువడకపోవడంపై స్థానికంగా ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత అత్యంత కీలకమని, అభ్యర్థి స్వచ్ఛందంగా ఉపసంహరించుకున్నారా లేదా అన్నది నిబంధనల ప్రకారం నిర్ధారించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉపసంహరణ పత్రం స్వీకరణ, పరిశీలన, నమోదు ప్రక్రియపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ఈ పరిణామాల నేపథ్యంలో గంభీరం పంచాయతీలో జరిగిన నామినేషన్ ఉపసంహరణ వ్యవహారంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బోయ రమణ సమక్షంలోనే ఉపసంహరణ పత్రం స్వీకరించారా? ఆయనకు పత్రంలోని వివరాలను వివరించారా? నిబంధనల ప్రకారం ఉపసంహరణను నమోదు చేశారా? అభ్యర్థి అభ్యంతరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? అన్న అంశాలను పరిశీలించాల్సి ఉంది. సంబంధిత పత్రాలను తనిఖీ చేసి, ఇరువర్గాల వాదనలు తెలుసుకుని వాస్తవాలను వెల్లడించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకం నిలవాలంటే ఈ వ్యవహారంపై అధికారులు పారదర్శకంగా స్పందించాల్సిన అవసరం ఉంది.
గంభీరం సర్పంచి ఉపసంహరణపై వివాదం
- Advertisement -
RELATED ARTICLES


